హైదరాబాద్: రాష్ట్రంలో గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా లను పునర్వ్యవస్ధీకరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రామ్మోహన్ రెడ్డి, వీరేశం, పాల్యాయి హరీష్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి సమాధానమిచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో మండలాల ఏర్పాటు మొదలుకొని జిల్లాల పునర్వ్యవస్దీకరణ వరకు ఇష్టానురీతిలో మొక్కుబడిగా జరిగాయని, దీనివలన ఒకే నియోజకవర్గంలోని నాలుగు మండలాలు నాలుగు జిల్లాల్లో ఉండే పరిస్ధితి ఏర్పడిందన్నారు. అదేవిధంగా తమను పొగిడినవారి కోసం ఒక విధంగా, పొగడని వారికోసం మరో విధంగా, తమ అదృష్టసంఖ్యను ఊహించుకొని అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని అన్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కొత్త మండలాలు, డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి వర్గం చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్ధీకరణ చేపడతామని తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా నివేదిక తేప్పించి ఇదే శాసనసభలో చర్చించి అందరి ఆమోదంతో పునర్వ్యవస్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చారు.