➤ మనం ఈ రోజు ‘Information Revolution’లో ఉన్నామని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. టెక్నాలజీలో దూసుకుపోతున్నామని, రాబోయే రోజుల్లో అంతరిక్షంలో కూడా ఇళ్లను కట్టుకోబోతున్నాం అని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఇది వినడానికి చాలా బాగుంది. కానీ… ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ప్రాథమిక హక్కులైన గాలిని, నీటిని, ఆహారాన్ని కూడా స్వచ్ఛంగా అందించలేని ఒక Incompetent Civilization (అసమర్థ నాగరికత)లో ఉన్నామనే చేదు నిజాన్ని మాత్రం మనం గుర్తించడం లేదు.
➤ మనం అభివృద్ధి గురించి ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్నాం. తప్పేం లేదు. కానీ… ‘Development’ పేరిట జరుగుతున్న Ecological Destruction (పర్యావరణ విధ్వంసం) గురించి మనం ఒక్క నిమిషమైనా ఆలోచిస్తున్నామా..?
➤ ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం. మన పూర్వీకులు మనకు పచ్చని పొలాలు, స్వచ్ఛమైన నదులు, పీల్చడానికి స్వచ్ఛమైన గాలిని ఇచ్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే… ఒక ‘Clean Environment’ను మనకు వారసత్వంగా అందించారు. మరి… అదే ‘Clean Environment’ను బాధ్యతగా మన పిల్లలకు, రేపటి తరానికి మనం అందిస్తున్నామా… లేదా..? అని ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరముంది.
➤ మన పిల్లల భవి పేరు మీద కోట్ల ఆస్తులు కూడబెట్టొచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టించొచ్చు. కానీ వారు పీల్చే గాలి కలుషితమైతే, వారు తాగే నీరు విషతుల్యం అయితే, ఆ ఆస్తుల వల్ల ఉపయోగం ఏంటి..? మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతుందా..? ఇది ఎలా ఉందంటే… మన బిడ్డలకు మనమే ‘బంగారు గిన్నె’లో ‘విషం’ ఇచ్చి తాగమన్నట్టు ఉంటుంది. అవునా… కాదా…?
➤ డబ్బు… సంపద… ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ… ప్రకృతి ఒక్కసారి నాశనమైతే తిరిగి రాదు. మన పిల్లలు… వారి పిల్లలు… ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే వారికి మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి “క్లీన్ ఎన్విరాన్ మెంట్” మాత్రమే.
➤ మనం ఈ భూమికి ‘Whole and Soul Proprietors’ కాదు, కేవలం ధర్మకర్తలం (Trustees) మాత్రమే. మన ఫ్యూచర్ జనరేషన్స్ కు ‘క్లీన్ ఎన్విరాన్ మెంట్’ను అందించడం అనేది మనం వారికి చేసే హెల్ప్ కాదు. అది మన Obligation. మనం ఇలాగే పర్యావరణాన్ని విధ్వంసం చేసుకుంటూ పోతే… రేపు మన పిల్లలు ఒక ‘Ecological Desert’లో బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుందనేది మనం తప్పకుండా అంగీకరించాల్సిన చేదు నిజం.
➤ చరిత్రలో గొప్ప మార్పులన్నీ ఒకే ఒక్క అడుగుతోనే మొదలయ్యాయి. ఎవరో ఒకరు… ఏదో ఒక చోట… ఎప్పుడో ఒకప్పుడు… అభివృద్ధి పేరిట జరుగుతున్న ఈ విధ్వంసాన్ని ఆపడానికి అడుగు ముందుకు వేయాలి కదా…? ఆ “ఎవరో ఒకరు” మేమే ఎందుకు కాకూడదు..? ఆ ‘ఏదో చోటు’ మనం నిలబడ్డ ఈ పోరాటాల పురిటిగడ్డ ‘తెలంగాణ’ ఎందుకు కాకూడదు..? ఆ “ఎప్పుడో ఒకప్పుడు”… ఇప్పుడే ఎందుకు కాకూడదు…?
➤ అందుకే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా ప్రభుత్వం ఆ చారిత్రక బాధ్యతను భుజానికెత్తుకుంది. మన పిల్లల కోసం… రేపటి తరాల భవిష్యత్తు కోసం, ఈ నేల మనుగడ కోసం మేము ‘HILT’ పాలసీ పేరిట ఓ చారిత్రాత్మక మార్పు వైపు మొదటి అడుగు వేశాం. అయినా సరే… కొందరు కావాలని ఈ పాలసీలో ఏదో మతలబు ఉందంటూ మాపై విమర్శలు చేస్తున్నారు.
➤ చాలా మంది దీనిని కేవలం ఒక సాదాసీదా ‘Land Transformation’ గా మాత్రమే చూస్తున్నారు. ‘భూమి వినియోగం మారుతోంది, పారిశ్రామిక ప్రాంతం కాస్తా నివాస ప్రాంతంగా మారుతోంది’ అని కేవలం రెవెన్యూ రికార్డుల కోణంలో మాత్రమే చూస్తున్నారు. కానీ నేను ఈ సభ ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలకు… రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నా. ఇది కేవలం ‘Change of Land Use’ కాదు, ఇది మన పిల్లల కోసం… రాబోయే తరాల కోసం మా ప్రభుత్వం వేస్తున్న ఒక ‘ఆరోగ్యకరమైన పునాది’.
➤ ఈ పాలసీ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేయడం కాదు… మా ఉద్దేశం. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించి మన పిల్లలకు… రేపటి తరాలకు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని, తాగేందుకు స్వచ్ఛమైన నీటిని అందించాలన్నదే మా సంకల్పం.
➤ 1970వ దశకంలో IDPL రాకతో హైదరాబాద్ పారిశ్రామిక ప్రస్థానం మొదలయ్యింది. ఆనాడు బాలానగర్, సనత్ నగర్, ఉప్పల్, జీడిమెట్ల, చర్లపల్లి వంటి ప్రాంతాలను కేవలం పరిశ్రమల కోసమే “ప్రత్యేక జోన్లు” (Exclusive Industrial Zones) గా కేటాయించారు. అప్పట్లో ఇవి నగరం చివర, జనావాసాలకు కిలోమీటర్ల దూరంలో, నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఉండేవి. ఆనాడు అక్కడ పరిశ్రమలు ఉండటం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండేది కాదు.
➤ కానీ… ఈ 50 ఏళ్లలో ఏం జరిగింది…? హైదరాబాద్ నగరం మనం ఊహించని విధంగా, ప్రపంచపటంలో ఒక మహా నగరంగా విస్తరించింది. ఒకప్పుడు ఎక్కడో “అవుట్ స్కర్ట్స్” లో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు, నేడు నగరానికి “నడిబొడ్డు” (Central Business Districts ) గా మారిపోయాయి. అంటే, అప్పట్లో పరిశ్రమల కోసం కేటాయించిన చోట… నేడు లక్షలాది కుటుంబాలు నివసించే రెసిడెన్షియల్ కాలనీలు వెలిశాయి.
➤ నాడు ఫ్యాక్టరీకి, మన ఇంటికి మధ్య కిలోమీటర్ల దూరం ఉండేది. నేడు ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్మెంట్ ఉంది. చిమ్నీ నుంచి వచ్చే విషపూరిత పొగ గాలిలో కలిసిపోయే అవకాశం లేకుండా, నేరుగా బెడ్ రూమ్‌లోకి ప్రవేశిస్తోంది. ఓవైపు నివాస గృహాలు, మరోవైపు పరిశ్రమలు. ఈ రెండింటి మధ్య ‘బఫర్ జోన్’ అంటూ లేకుండా పోయింది… ఓ రకంగా చెప్పాలంటే… ఇది కేవలం ప్లానింగ్ లోపం కాదు అధ్యక్షా, శాస్త్రీయంగా ఒక పెను ప్రమాదానికి (Scientific Disaster) బహిరంగ ఆహ్వానం పలకడమే.