- ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్
- వారం రోజుల్లో మరో 3 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లు
- రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ : రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే- ల్యాండ్ రికార్డ్స్ విభాగాలను భూభారతి పోర్టల్‌లో ఒకే గొడుగు కిందకు తీసుకువస్తున్నామని ఈ పోర్టల్‌ను మార్చి నాటికి పూర్తి స్ధాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు, పారదర్శకంగా ఉండేలా ఈ పోర్టల్‌ను రూపొందించామని వెల్లడించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, దేవాదాయ, అటవీ, వక్ప్ భూములు తదితర అన్ని వివరాలు కనిపించేలా పోర్టల్‌లో పొందుపరిచామని తెలిపారు. మంగళవారం నాడు నాంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ( ట్రెస్సా) 2026 డైరీని మంత్రిగారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనాటి ప్రభుత్వ పదేళ్ల పాలనలో రెవెన్యూ వ్యవస్ధలో ఎదుర్కొన్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుందనే నమ్మకంతో తెలంగాణ ప్రజానీకం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పదేళ్ల కాలంలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్ధను ఒక్కో మెట్టు పేర్చుకుంటూ గ్రామ స్ధాయి వరకు బలోపేతం చేశామని ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని అయితే ఇవి సరిపోవని ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని మంత్రి గారు అన్నారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా గడచిన రెండేళ్లలో ఎన్నొ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి పోర్టల్ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రైతుల భూములకు సంబంధించి గుండెకాయలాంటి సర్వే విభాగాన్ని పటిష్టపరుస్తున్నామని ఇందులో భాగంగా ఇప్పటికే 3500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోవడం జరిగిందని వారం రోజుల్లో మరో మూడువేల మందిని తీసుకోబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తమ ప్రభుత్వం అర్ధం చేసుకుందని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక ఇబ్బందుల వల్లే కొంత ఆలస్యం జరుగుతుందని ప్రభుత్వం తరపున ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెస్సా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్, కోశాధికారి రమణారెడ్డి, కల్చరల్ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, టిఎన్‌జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్, జగదీష్, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి జిహెచ్ఎంసీ జోనల్ కమీషనర్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.