- పాపాల్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు అడుగులు
- పన్నెండేండ్ల ప్రభుత్వ రికార్డులు అవాస్తవమా..?
- ప్రభుత్వ అధికారిక పత్రాలే హెటిరో నేరానికి సాక్ష్యాలు
- బయటపడేందుకే నష్టపరిహారం పేరునా చెక్కుల పంపిణీ
- హెటీరో యాజమాన్యానికి అధికారుల పూర్తి దాసోహం
- కొందరు అధికారులు పరిశ్రమకు తొత్తులుగా మారారు
- ఎవరెన్ని కుట్రలు చేసినా మా ఉద్యమాన్ని ఆపలేరు
- లంచాలకు ఆశపడి మా ప్రాణాల్ని పణంగా పెట్టలేం…
- కాలుష్యం పీడ విరగడయ్యే వరకూ పోరాటం సాగిస్తాం..
- మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తాం..
- దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ
పన్నేండ్లుగా కాలుష్యాన్ని వదులుతూ తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హెటిరో ఫార్మా పరిశ్రమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అర్థం లేని వాదనలను తెరపైకి తీసుకుని రోజుకొక కుట్ర చేస్తుందని దోమడుగు కాలుష్య వ్యతిరేక కమిటీ సభ్యులు ఆరోపించారు. అధిక వర్షాల వలన చెరువులో బ్యాక్టీరియా పెరిగి నీరు రంగు మారిందని హెటిరో పరిశ్రమ తమ తప్పును పక్కదారి పట్టించేందుకు చేసినా ప్రయత్నాలను ఖండిస్తూ దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు నల్లకుంట చెరువు వద్ద మీడియా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యానికి తమకు సంబంధం లేదంటూ హెటిరో పరిశ్రమ యాజమాన్యం ప్రకటనను తీవ్రంగా ఖండించారు.హెటిరో ఫార్మా యాజమాన్యంతో పాటు అధికార యంత్రాంగానికి పలు ప్రశ్నలు సంధించారు. ఒక పక్క పనికిరాని అవాస్తవాలు తెర పైకి తెచ్చి ప్రచారం చేస్తూనే మరోపక్క అధికారుల సహకారంతో దొంగ చాటున డేటా తీసుకుని తహసీల్దార్ కార్యాలయంలో రహస్యంగా ఎకరాకు రూ.12 వేల చెక్కులు పంపిణీ చేస్తూ కాలుష్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్షించారు.
పన్నెండేండ్ల నుంచే కాలుష్య రక్కసి..
12 ఏళ్ల కింద నుంచి హెటిరో పరిశ్రమ మూలంగా కాలుష్య సమస్య మొదలైందని గ్రామస్థులు వాపోతున్నారు. అప్పట్లో ప్రభుత్వం అందించిన నివేదికలను బహిర్గతం చేశారు. 2012 అక్టోబర్ లో నల్లకుంట చెరువు నీరు గులాబీ వర్ణంలోకి మారాయని పీసీబీ సేకరించి అందులో ప్రమాదకర రసాయణాలున్నాయని స్పష్టం చేసిందని తెలిపారు. 2013 మార్చిలో సంస్థ సొంత ఖర్చులతో చెరువు నీటిని ఖాళీ చేసి తమ ప్లాంట్ లో శుద్ధి చేయాలని ఆదేశించినా విషయాన్ని గుర్తు చేశారు. 2013 మార్చిలో హెటిరో పరిశ్రమ వ్యర్థాలను వర్షపు నీటి కాలువల ద్వారా చెరువులోకి వదిలిందని ప్రభుత్వం ఏర్పాటు చేసినా టాస్క్ ఫోర్స్ కమిటీ నిర్ధారించిందని స్పష్టం చేశారు. 2013లో కొందరు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించగా కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలను పరిశ్రమ కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో పరిశ్రమపై లీగల్ గా చర్య తీసుకునే హక్కు గ్రామస్తులకు ఉందని ప్రకటించిందని పేర్కొన్నారు. కాలుష్యంతో పరిశ్రమకు సంబంధం లేకపోతే గతంలో ప్రభుత్వ శాఖలు అందించిన రిపోర్టులన్ని తప్పుడు నివేదికలా అని ప్రశ్నించారు. పరిశ్రమలో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ పని చేస్తుంటే మీడియాకు, గ్రామస్థులకు ప్రత్యక్షంగా ఎందుకు చూపడం లేదని ప్రశ్నలు గుప్పించారు. పన్నెండేండ్ల కింద హెటిరో కంపెనీ కాలుష్యం చేస్తుందని రుజువైందని ఇప్పుడు పరిశ్రమ అందించే అర కోర డబ్బులకు ఆశపడి మా ఆరోగ్యాన్ని, భూములను, పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టబోమని కుండబద్దలు కొట్టారు. కొందరు స్వార్థపరుల మాటలు విని మన ఐక్యతను దెబ్బతీసుకోవొద్దని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.
మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తాం..
హెటిరో కంపెనీ వల్ల కాలుష్యం జరిగిందని అధికారిక పత్రాలు రుజువు చేస్తున్న కొందరు అధికారులు పరిశ్రమకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. కాలుష్యంపై జరుగుతున్న పోరాటాన్ని నీరు గార్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన ఉండాల్సిన తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్, పీసీబీ ప్రధాన కార్యాలయ అధికారులు కంపెనీ ఏజెంట్లుగా మారి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలుష్య సమస్య తీరడం కోసం మున్సిపల్ ఎన్నికలను బహిష్కరించడం ద్వారా తమ నిరసనను ప్రభుత్వానికి చేరవేస్తామని తెలిపారు. కాలుష్య రహిత దోమడుగు కోసం రాజీలేని పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మంగయ్య, జైపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాలకృష్ణ గౌడ్, సత్యనారాయణ, రమేష్, శ్రీధర్, సత్తిరెడ్డి, శంకరయ్య, రాఘవ రెడ్డి, భాస్కర్, వెంకట్ రెడ్డి, స్వేచ్ఛ రెడ్డి, పెద్దరాజు, ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు. ( సోర్స్: దిశ)