హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టిందని ఈ రెండు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఒక స్పష్టమైన కొత్త దిశను చూపిస్తూ అభివృద్ధి –సంక్షేమాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. “రైజింగ్ రేవంత్ రెడ్డి, రెండేళ్ల పాలనలో పదేళ్ల ప్రగతి” పేరుతో స్పీక్ సంస్ధ రూపొందించిన సావనీర్‌ను గురువారం నాడు తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డితో కలసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తెలంగాణను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే కాలంలో మరింత వేగంగా అభివృద్ధి, మరింత విస్తృతంగా సంక్షేమం అందేలా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రతి నిర్ణయంలో ప్రజలే కేంద్రబిందువుగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని అన్నారు. పదేళ్లుగా నిర్లక్ష్యం, అవినీతి, అహంకార పాలనతో వెనుకబడ్డ తెలంగాణను తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరించిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలను విధానాలుగా మలుస్తూ, మాటలు కాదు – పనులే ప్రామాణికంగా పరిపాలన సాగిస్తున్నామని తెలిపారు.
రెండేళ్ల కాలంలోనే రైతులు, పేదలు, మహిళలు, యువత, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు న్యాయం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని, సంక్షేమ పథకాలను కాగితాలకే పరిమితం చేయకుండా ప్రజలకు అందించామని మంత్రి అన్నారు. రెవెన్యూ శాఖ పరంగా భూ పరిపాలనలో పారదర్శకత తీసుకురావడం, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారాలు చూపడం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆధునిక సాంకేతికతతో సర్వే ప్రక్రియలను వేగవంతం చేయడం వంటి చర్యలు ప్రజలకు నేరుగా మేలు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద, స్పీక్ సంస్ద గౌరవ సలహాదారు అన్నే సత్యనారాయణ, అధ్యక్షుడు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.