- దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు.. మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. న్యూఢిల్లీలో గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా మంత్రుల వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించారు. ఈవీ పాలసీ తీసుకొచ్చిన కొత్తలో తెలంగాణలో కేవలం 4,376 ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేవని.. కానీ 2025 ఏడాదిలో ఆ సంఖ్య 2,58,325కు పెరిగినట్టు మంత్రి చెప్పారు. తెలంగాణలో 2024లో కొత్త స్క్రాప్ పాలసీని ప్రకటించాం. పాత వాహనాలను స్క్రాప్ చేస్తే.. ట్యాక్స్ తగ్గింపు, పెనాళ్టీ రద్దు వంటి ప్రోత్సాహకాలను ప్రకటించాం. అలాగే.. 15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వం వాహనాలను కచ్చితంగా స్క్రాప్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రైవేట్ వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ విధించి.. స్క్రాప్ చేయడానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం.
తెలంగాణలో వాహనాల ఫిట్‌నెస్ తనిఖీలను మరింత కఠినతరం చేశాం. ఈ ప్రక్రియలో భాగంగానే 37 ఆటోమేటెట్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. వీటి ద్వారా ఫిట్‌నెస్ లేని వాహనాలను నిలిపివేస్తున్నాం. రోడ్ సేఫ్టీని పెంచి.. కాలుష్యాన్ని తగ్గిస్తున్నాం. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే విధానాన్ని కూడా మరింత మరింత కఠినతరం చేస్తున్నాం. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. మాన్యువల్ సిస్టమ్‌ను తగ్గించి.. కెమెరాలు, సెన్సార్లు, ఏఐ ద్వారా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. అలాగే.. ప్రజల భద్రత దృష్ట్యా.. వెహికిల్ లొకేషన్ ట్రాకింగ్ పరికరాలను ప్రజా రవాణా వాహనాలకు అమర్చి.. వాటిని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి.. మానిటర్ చేస్తున్నాం. డ్రైవింగ్ లెసెన్స్‌లకు సంబంధించి.. సారథి-ఎన్ఐసీ అప్లికేషన్‌ను అమలు చేస్తున్నాం. వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి.. వాహన్-ఎన్ఐసీ అప్లికేషన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. అలాగే.. ఎలక్ట్రిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్, ఏఐ ఆధారిత పర్యవేక్షణ విధానాలను అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో వల్డ్ క్లాస్ ట్రాన్స్‌పోర్ట్ అకాడమీ, మరో 2 ఐడీటీఆర్ సెంటర్ల ఏర్పాటు, ట్రక్ టర్మినల్, పార్కింగ్ యార్డుల అభివృద్ధి, హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ బస్టాండ్ల నిర్మాణం, పాస్‌పోర్ట్ ఆఫీసుల తరహాలో.. ఆర్టీఓ కార్యాలయాలను ఆధునీకీకరణ చేస్తాం. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు ఉన్నతాధికారులు వికాస్ రాజ్, కే.ఇలంబర్తి పాల్గొన్నారు.