తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ & క్యాలెండర్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ 2026 డైరీ & క్యాలెండర్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ, రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంఘాల నాయకులు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని అనుకుంటున్నారని చెబుతున్నారు. మనమంతా ఒకే కుటుంబం… కుటుంబంలో కుమ్మక్కులు ఏం ఉంటాయి. మీరు, మేము వేరువేరు కాదు. ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉంటే చూడలేని వారు, కడుపులో విషం పెట్టుకునే వారు ఎప్పుడూ ఉంటారు. దేవతలు కూడా యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి ప్రయత్నించారు. ఒక శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో ఉండి అసెంబ్లీకి మారీచుడు లాంటి వాళ్లను పంపిస్తున్నారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మాపై మోపి వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం 18 వేల కోట్లు. కానీ ప్రతీ నెలా 22 వేల కోట్లు అప్పులకు చెల్లించాల్సిన పరిస్థితి. సగటు మధ్యతరగతి వ్యక్తి గౌరవంగా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో.. ప్రభుత్వానిది కూడా అదే పరిస్థితి. మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లడం వల్లే సమాజంలో తెలంగాణ గౌరవం నిలబడింది. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. పదిన్నర లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములే. మీరే మా సారధులు, మా వారధులు. మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా. గతంలో మీ జీతాలు ఎప్పుడొచ్చేవి.. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. సంక్రాంతి కానుకగా మీ డీఏపై సంతకం చేసి వచ్చా. మీ ఆరోగ్య భద్రత విషయంలో పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చే చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులకు ప్రమాద బీమా కోటి రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. ఇదొక బాధ్యత.. అందరం కలిసికట్టుగా బాధ్యతను నిర్వహిస్తేనే పరిపాలన పరుగులు పెడుతుంది. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది. జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ విషయంలో పలు విజ్ఞప్తులు, డిమాండ్స్ వచ్చాయి. గతంలో జిల్లాలు, మండలాలను ఇష్టం వచ్చినట్లుగా విభజించారు. జిల్లాలు, మండలాల పునర్ వ్యవస్థీకరణకు త్వరలోనే రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జితో ఒక కమిషన్ ను నియమిస్తాం. ఈ కమిషన్ రాష్ట్రమంతా పర్యటించి జిల్లాలు, మండలాల రేషనలైజేషన్ విషయంలో ప్రజల సూచనలు, సలహాలు తీసుకుంటుంది. బడ్జెట్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలతో కూలంకషంగా చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తాం. గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం కార్యాలయం నిర్మాణానికి సహకరిస్తాం. ప్రజలకు మంచి పరిపాలన అందిద్దాం.. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది.