రవీంద్రభారతిలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు

  • ఓటరు చైతన్య జ్యోతిని వెలిగించనున్న గవర్నర్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలను రాష్ట్ర గవర్నర్‌ శ్రీ జిష్ణుదేవ్‌ వర్మ జనవరి 25, ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లక్డీకాపూల్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఉదయం 11 గంటల నుంచి నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

ఈ ఏడాది జాతీయ థీమ్‌ “మై ఓట్ — ఐ యామ్‌ ఇండియా (मैं भारत हूँ)” అని ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాధాన్యతను బలంగా చాటిచెప్పడం, ముఖ్యంగా తొలి ఓటర్లు మరియు యువతలో అవగాహన పెంపొందించడం ఈ వేడుకల ప్రధాన లక్ష్యమని వివరించారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (రిటైర్డ్‌) శ్రీమతి ఐ. రాణి కుముదిని, ఐఏఎస్ హాజరుకానున్నారు. పలు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. “ఈ ఏడాది లక్ష్యం — అప్రమత్తమైన, పరిశీలనాత్మకమైన, నిజాయితీ గల ఓటరును తీర్చిదిద్దడం. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి పౌరుడి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే మా ప్రయత్నం” అని సీఈవో సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. వేడుకల్లో ఓటరు అవగాహన కార్యక్రమాలు, ప్రతిజ్ఞ స్వీకరణ, అవార్డుల ప్రదానం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.