రాజీవ్ స్వగృహ ఓపెన్ ఫ్లాట్లకు వేలం

  • తొర్రూర్, బహదూర్ పల్లి, కుర్మల్ గుడ ల్లోని 137 ప్లాట్లు(plots)
  • మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ
  • ఫిబ్రవరి 7-8 తేదీల్లో బహిరంగ వేలం

హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న 137 ఓపెన్ ప్లాట్లను (plots) బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తొర్రూర్ , కుర్మల్ గుడ, మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్ పల్లి ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చెంది మౌలిక వసతులతో ఉన్న ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ వి.పి.గౌతం తెలిపారు. ఆయా ప్రాంతాలను బట్టి బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరల్లోనే చదరపు గజానికి రూ. 20 వేల నుంచి 30 వేల వరకు అప్ సెట్ ప్రైస్ తో ఈ ప్లాట్లు (plots) అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. తమ ఆకాంక్షలు, అభిరుచులకు అనుగుణంగా సొంత స్థలంలో ఇంటిని నిర్మించుకోవాలనుకుంటున్న వారికి ఈ ప్లాట్లు చాలా అనుకూలంగా ఉంటాయని ఎం.డి శ్రీ వి. పి. గౌతం తెలిపారు. మంచి కనెక్టివిటీతో ఎటువంటి వివాదాలు లేని క్లియర్ టైటిల్, ప్రభుత్వ యంత్రాంగమే ఈ లేవుట్లను అభివృద్ది చేయడం, కొనుగోలు చేసిన వెంటనే భవన నిర్మాణాలను చేపట్టేందుకు వీలుగా ఉన్న ఈ ప్లాట్లకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్ల కొనుగోలుకు గతంలో పెద్ద ఎత్తున స్పందన రావడంతో మరోసారి ప్లాట్లను వేలం ద్వారా విక్రయిస్తున్నామని ఆయన తెలిపారు.
వీటి కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారు నిర్ణీత ధరావతును (EMD) మీ-సేవా కేంద్రాల్లో ఆన్ లైన్ /యుపి ఐ ద్వారా చెల్లించవచ్చని, అలాగే డిడి ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు.
ఓఆర్ఆర్-ఆదిభట్ల, ఐటి క్యారిడార్ కు సమీపంలోని తొర్రూర్ లే అవుట్ లోని ప్లాట్లకు ఫిబ్రవరి 7, 8 వ తేదీ న, ఓఆర్ ఆర్ సమీపంలోని బహదూర్ పల్లి, శంషాబాద్ ఎయిర్ పోర్టు కు దగ్గర్లో ఉన్న కుర్మల్ గుడ ప్రాంతాల్లోని ప్లాట్లకు ఫిబ్రవరి 8 వ తేదీ మధ్యాహ్నం బహిరంగ వేలం నిర్వహిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు www.swagruha.telangana.gov.in వెబ్ సైట్ లో చూడవచ్చని వివరించారు. పోన్ నెంబర్లు 8121022230 (తొర్రూర్), 8347472106 (బహదూర్ పల్లి),7993455802 (కుర్మల్ గుడ)లలో సంప్రదించవచ్చు.

అందుబాటులోని ప్లాట్లు
తొర్రూర్ – 105 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. చదరపు గజానికి కనీస ధర (అప్ సెట్ ప్రైస్) రూ. 25 వేలు కాగా ఇవి 200-500 చదరపు గజాల విస్తీర్ణం లో ఉన్నాయి.
బహదూర్ పల్లి – 12 ప్లాట్లు ఉన్నాయి. 200-1000 చ.గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ లేవుట్ లోని కార్నల్ ప్లాట్ కు చదరపు గజానికి కనీస ధర రూ.30 వేలుగాను, ఇతర ప్లాట్లకు రూ. 27 వేలుగాను నిర్ధారించారు. కుర్మల్ గుడ – 20 ప్లాట్లు 200-300 చ.గజాల విస్తీర్ణంలో ఉండగా చదరపు గజానికి రూ.20 వేలు కనీస ధరగా నిర్దారించి బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నారు.

దరఖాస్తుకు ఆఖరు తేదీలు
తొర్రూర్ ప్రాంతంలోని ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి చూపే వారు రూ. 2 లక్షల ధరావతుతో ఫిబ్రవరి 6 తేదీ లోగా, బహదూర్ పల్లిలోని ప్లాట్లకు రూ. 3 లక్షలు, కుర్మల్ గుడ లోని ప్లాట్లకు రూ.2 లక్షల ధరావతుతో ఫిబ్రవరి 7 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.