హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థలలో బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల స్థాయి వరకు ప్రతి విద్యా సంస్థలోను మెరుగైన బోధన సాగాలని, విద్యా బోధనలలో నాణ్యత ప్రమాణాలు పెంచే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని సి.ఎస్ ఆదేశించారు. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విద్యాశాఖ పై సంబంధిత ఉన్నతాధికారులతో బుధవారం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, డిజిటల్ విద్య, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లో పనితీరు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం, తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఉన్నత విద్యా సంస్థలు, కళాశాలలో, విశ్వవిద్యాలయాలలో బోధన చేసి రిటైర్డ్ అయిన మంచి అనుభవం కలిగిన ఫ్రోపెసర్స్, లెక్చరర్స్, టీచర్స్ తో విద్యార్థులకు తరుచుగా మూఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు బోధన చేయిస్తే విద్యార్థులలో సృజానాత్మకత, మోటీవేషన్, మంచి ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. తద్వారా విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించి ప్రణాళికలు ఏర్పరచుకొనే అవకాశం ఉంటుందని అన్నారు.
అదే విధంగా కేజిబివి, వివిధ సంక్షేమ వసతి గృహాలలో ఒక వసతి గృహాన్ని ఎంపిక చేసుకొని అందులో సోలార్ మోడల్ తరహా కిచెన్, స్టోరేజ్ రూమ్స్, మౌలిక వసతులు, త్రాగునీరు, టాయిలెట్స్, విద్యుత్, ఇంటర్నెట్ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి దానిని ఒక మోడల్ హాస్టల్ గా రూపొందించాలని సి.ఎస్ అధికారులకు సూచించారు. దానిని ఆదర్శంగా తీసుకోని భవిష్యత్ లో మిగితా వసతి గృహాలలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. కళాశాలల స్థాయిలో కెరీర్ గైడెన్స్ తరగతులు నిర్వహించాలని, B.Ed కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులతో ఇంటర్న్షిప్ కార్యక్రమం క్రింద ప్రభుత్వ పాఠశాలలో బోధన చేయించాలని, విద్యార్థులలో ఆసక్తి, నైపుణ్యాలు పెంచే విధంగా అనుభవం కలిగిన రిటైర్డ్ ఉపాధ్యాయులు, మార్గదర్శకులతో తరగతులు నిర్వహిస్తే విద్యార్థులకు మంచి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఐటి ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా, పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ నికోలస్ తదితరులు పాల్గొన్నారు.