ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్షా సమావేశం

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఇంధన, వైద్య ఆరోగ్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, మైన్స్, టిజిఐఐసి, భారత ఫ్యూచర్ సిటీ , ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మూసీ సుందరీకరణ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ తదితర శాఖల పనితీరుపై విభాగాల వారీగా గురువారం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇంధన శాఖ:
ఈ సమావేశంలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, టిజి ట్రాన్స్‌కో, టిజి జెన్‌కో, టిజి ఎస్‌పిడిసిఎల్, టిజి ఎన్‌పిడిసిఎల్ విభాగాలలో కొనసాగుతున్న ప్రతిపాదిత ప్రాజెక్టుల పురోగతి, అలాగే భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సి.ఎస్ ఆదేశించారు. అలాగే, పునరుత్పాదక ఇంధన రంగంలో చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ప్రాజెక్టుల అమలులో నిర్ణీత కాలపరిమితులను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో విద్యుత్ రంగంలో అమలవుతున్న విధానాన్ని పరిశీలించి మన రాష్ట్రంలో కూడా వివిధ డిస్కంలలో అమలు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్రంవిలో ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిపై సి.ఎస్ కు వివరించారు. ఇ-గవర్నెన్స్, తదితర అంశాలు, అండర్ గ్రౌండ్ కేబులింగ్, విజన్ 2047 లక్ష్యాలు, గ్రేటర్ హైదరాబాద్ భవిష్యత్ విద్యుత్ అవసరాల మేరకు ప్రతిపాదించిన చంద్రవెళ్లి, రాయదుర్గం, షాద్ నగర్, పరిగి లో విద్యుత్ సబ్ స్టేషన్ల పనుల పురోగతి పై సి.ఎస్ సమీక్షించారు.
వైద్య ఆరోగ్య శాఖ:
రాష్ట్రంలో వరంగల్, ఆల్వాల్, సనత్ నగర్, ఎల్.బి.నగర్, న్యూ ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రి విస్తరణ పలు ప్రాంతాలలో నిర్మితమవుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల భవనాల పురోగతి, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యత, వైద్య సదుపాయాల లభ్యత, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల సరఫరా, వైద్య శాఖలో నర్సింగ్, వైద్యుల నియమకాలు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇహెచ్ఎస్ పథకం, వైద్య పరికరాల సరఫరా తదితర అంశాలపై సి.ఎస్ సమీక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సి.ఎస్ ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ, దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆరోగ్య కార్యక్రమాలు, పథకాల అమలుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సి.ఎస్, లక్ష్యాల సాధనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. మాతా–శిశు ఆరోగ్యం, సంక్రమణ రోగాల నియంత్రణ, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆసుపత్రుల్లో పరిశుభ్రత, రోగులకు సౌకర్యాలు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా జి.హెచ్.యం.సి పరిధిలో చేపట్టిన ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం, ఆల్వాల్, సనత్ నగర్, ఎల్.బి.నగర్, వరంగల్ ఆసుపత్రుల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాల‌ని సి.ఎస్ అధికారులను ఆదేశించారు. నూత‌న ఆసుప‌త్రుల అవ‌స‌రాల‌కు మేరకు త‌గిన‌ట్లు అధునాతన వైద్య ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని, ఇందుకు సంబంధించి త‌గిన‌ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అధునాత‌న ప‌రిక‌రాల ఏర్పాటుకు త‌గిన‌ట్లు గ‌దులు, ల్యాబ్‌లు, ఇత‌ర నిర్మాణాలు ఉండాల‌ని అధికారుల‌కు సూచించారు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, మైన్స్, టిజిఐఐసి:
ఈ సమావేశంలో ఐటీఈ & సీ శాఖలో ప్రస్తుత కార్యకలాపాలు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై అధికారులు సి.ఎస్ కు వివరించారు. ముఖ్యంగా డిజిటల్ గవర్నెన్స్, ఐటీ పెట్టుబడుల ఆకర్షణ, స్టార్టప్ ఎకోసిస్టం అభివృద్ధి, ఈ-గవర్నెన్స్ సేవల విస్తరణ, సైబర్ సెక్యూరిటీ, రాష్ట్రంలో ఉన్న 12,751 గ్రామ పంచాయతీలలో టి ఫైబర్ విస్తరణ పై సమీక్ష చేశారు. రాష్ట్రాన్ని ఐటీ రంగంలో మరింత పోటీగా నిలిపే దిశగా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడం, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ప్రభుత్వ సేవలను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించే దిశగా చర్యలు తీసుకోవాలని, వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఐటీ సేవలను ప్రజలకు సులబతరంగా అందించేందుకు ఒక WhatsApp రూపొందించాలని, మీసేవ కేంద్రాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆధికారులకు సూచించారు. రాష్ట్రంలో వీలైనంత మేరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో టి-ఫైబర్ విస్తరణకు తగు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మైన్స్ శాఖలో ఇసుక సరఫరా పై సాండ్ రీచ్ లలో ఏర్పాటు చేసిన సి.సి.టివీల ఏర్పాటు, ఇటీవల కాలంలో చేపట్టిన సంస్కరణలపై అధికారులు సి.ఎస్ కు వివరించారు. భారత ఫ్యూచర్ సిటీ, టిజి ఐఐసి చేపట్టిన పనుల పురోగతి పై సి.ఎస్ సమీక్షించారు. ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మూసీ సుందరీకరణ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ విభాగాలలో చేపట్టిన ప్రాజెక్టలపై సి.ఎస్ సమీక్షించారు. గత మూడు రోజులుగా ఇప్పటి వరకు (13) విభాగాలను ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. రాబోయే రెండు రోజులలో మిగతా విభాగాల సమీక్షకు సిద్ధమవుతున్నారు.

ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్ రంజన్, సంజయ్ కుమార్, నవీన్ మిట్టల్, మైన్స్ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, హెచ్ యం.డి.ఎ. కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి టి.కె.శ్రీదేవి, టిజి ట్రాన్స్‌కో సిఎండి కృష్ణ భాస్కర్, టిజి ఎస్పిడీసీల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కమిషనర్ శశాంక, హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్, ఐటి ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా, టిజి ఎన్.పి.డి.సి.ఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ యం.డి. ఆశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.