పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే మనిషి మనుగడకే ప్రమాదకరం: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

పర్యావరణాన్ని మనం ఎంతగా నిర్లక్ష్యం చేస్తే దాని పర్యవసానాలు మనిషి మనుగడకు అంత ప్రమాదకరంగా పరిణమిస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్ పల్లి సమీపంలోని ఎర్త్ సెంటర్ లో కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్ – భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తన పండుగ ఆదివారంతో ముగిసింది. ఆర్టీఐ మాజీ కమిషనర్ దిలీప్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పాత వ్యవసాయ పద్ధతులను పరిరక్షించుకోవడం ద్వారా భూసారం, మనుషుల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. పశు సంపదను పెంచుకోలేకపోతే వచ్చే ఐదేళ్లలో మన భూమి, మన వ్యవసాయం మనకు కాకుండా పోతాయని హెచ్చరించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. దేశీ విత్తనాల గ్రేడింగ్ తో ప్రకృతి వ్యవసాయంలోనూ అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దేశీ విత్తనాలు దేశ సంపద అని, వాటి విసృత వినియోగానికి ప్రోత్సాహం ఇచ్చే రీతిలో ప్రణాళికా బద్ధమైన ప్రభుత్వ విధానాలు అవసరమన్నారు. ప్రభుత్వ విధానాల్లో మార్పు వచ్చినప్పుడే ప్రకృతి వ్యవసాయం సాధ్యమవుతుందని ఏపీ మాస్ వ్యవస్థాపకుడు సీఎస్ రెడ్డి అన్నారు. పర్యావరణవేత్త దొంతి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో హైబ్రీడ్, దేశీ విత్తన వ్యవస్థల మధ్య సంఘర్షణ జరుగుతోందని చెప్పారు. అనేక రాష్ట్రాలలో కార్పొరేట్ ప్రయోజనాలతో కూడిన విత్తన వ్యవస్థను రైతులు సవాల్ చేస్తూ ప్రకృతి వ్యవసాయ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్ర మంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, జీవవైవిధ్య ప్రాధికారిక సం స్థ మాజీ అధ్యక్షుడు అచలేందర్ రెడ్డి, సీజీఆర్ వ్యవస్థాపకుడు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.