తెలంగాణ అటవీ శాఖను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జైకా) నుంచి రుణ సహాయం పొందేందుకు అటవీ శాఖ ప్రాథమిక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ మేరకు అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి (పీసీసీఎఫ్ హెచ్ఓఎ్ఫఎ్ఫ) సువర్ణ అధ్యక్షతన జపాన్ నుంచి వచ్చిన జైకా ప్రతినిధులతో అరణ్య భవన్లో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలపై జైకా ప్రతినిధులకు సువర్ణ వివరించారు. జైకా ప్రాజెక్ట్‌తో రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి, టైగర్ రిజర్వ్ బలోపేతం, వన్యప్రాణి సంరక్షణ, అర్బన్ ఫారెస్ట్ డెవల్‌పమెంట్, విస్తృత ప్లాంటేషన్ కార్యక్రమాలు, క్షీణించిన అడవుల పునరుద్ధరణ, అటవీ అగ్నిప్రమాదాల నివారణ వంటి పలు కీలక కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు నిర్ణయించారు. జైకా సహకారంతో వచ్చే ఐదేళ్ల కాలానికి రూ.1,270 కోట్ల విలువైన ప్రాథమిక ప్రతిపాదనలను సిద్ధం చేశారు. మొత్తం వ్యయంలో 85 శాతం నిధులను జైకా నుంచి రుణం రూపంలో, మిగతా 15 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని ప్రతిపాదనల్లో పొందుపరిచారు. ఈ సందర్భంగా జైకా ప్రతినిధులు మాట్లాడుతూ.. భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే దిశగా ప్రస్తుతం భారత్‌లోని పది రాష్ట్రాల్లో అటవీ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను జైకా అమలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ అటవీ శాఖ ప్రతిపాదించిన అభివృద్ధి కార్యక్రమాలు సమగ్రంగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రశంసించారు. పీసీసీఎ్‌ఫ(వైల్డ్‌లైఫ్) వినయ్ కుమార్, పీసీసీఎఫ్ రత్నాకర్ జౌహరి, సీసీఎ్ఫలు ప్రియాంక వర్గీస్, ఎస్.జె. ఆశ, క్షితిజతోపాటు పలు జిల్లాల డీఎ్‌ఫవోలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.