అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో మ‌మూనురు ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి

ఢిల్లీ: తెలంగాణ‌లో రెండో పెద్ద న‌గ‌ర‌మైన వ‌రంగ‌ల్ కు స‌మీపంలో నిర్మించ‌నున్న మామూనూరు ఎయిర్‌పోర్ట్‌ను అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో నిర్మించాల‌ని పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడుకు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడుతో పార్ల‌మెంట్‌లోని ఆయ‌న ఛాంబ‌ర్‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ పూర్త‌యినందున వెంట‌నే ప‌నులు ప్రారంభించాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవ‌ల‌తో పాటు మెయింటెనెన్స్‌.. ఓవ‌ర్ హాల్ రిపేర్ (ఎంఓఆర్‌) స‌దుపాయాలు ఉండేలా చూడాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. జౌళి, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌ల‌తో వ‌రంగ‌ల్ న‌గ‌రం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంద‌ని, వ‌రంగ‌ల్‌కు ద‌గ్గ‌ర‌లో రెండేళ్ల‌కోక‌సారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజ‌న జాత‌ర‌ స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ జాత‌ర మేడారంలో జ‌రుగుతుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం తెలియ‌జేశారు. వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్ట్ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌తో పాటు ఉమ్మ‌డి ఖ‌మ్మం, ఉమ్మ‌డి న‌ల్గొండ, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌కు కేంద్రంగా ఉంటుంద‌ని కేంద్ర మంత్రికి సీఎం వివ‌రించారు. మామూనూరు నుంచి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా విమాన రాక‌పోక‌లు సాగేలా ప‌నులు ప్రారంభించాల‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడును ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్ విమానాశ్ర‌యానికి సంబంధించి అనుమ‌తులు వెంట‌నే మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ఆ విమానాశ్ర‌య ఏర్పాటుకు అద‌నంగా అవ‌స‌ర‌మైన 249.82 ఎక‌రాలు అంద‌జేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలియ‌జేశారు. వెంట‌నే అనుమ‌తుల మంజూరు చేయాల‌ని కోరారు. మామూనూరు ఎయిర్‌పోర్ట్ ప‌నుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌కు సంబంధించి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల‌ను అక్క‌డ‌కు పంపిస్తాన‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. స‌మావేశంలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, సురేశ్ షెట్కార్‌, రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి, డాక్ట‌ర్ క‌డియం కావ్య‌, గ‌డ్డం వంశీకృష్ణ‌, ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ కే.ఎస్‌.శ్రీ‌నివాస రాజు, ముఖ్యమంత్రి కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, కేంద్ర ప‌థ‌కాల స‌మ‌న్వ‌య‌క‌ర్త డాక్ట‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ పాల్గొన్నారు.