పరిశ్రమలలో అగ్నిప్రమాదాల నివారణ, కార్మికుల భద్రతకు పటిష్ట చర్యలు: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు

  • అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి

భారీ పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల నివారణకు, కార్మికుల భద్రతకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, చర్యలపై స్పష్టమైన ఒక మాన్వువల్ ను సిద్ధం చేయాలని సి.ఎస్ ఆదేశించారు. గురువారం డాక్టర్ బిఆర్ అంబ్కేదర్ రాష్ట్ర సచివాలయంలో సిగాచి ఇండస్ట్రీస్‌లో జరిగిన దుర్ఘటన పై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను సంబంధిత అధికారులతో ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల, బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లింపులు, కోర్టు కేసుల పురోగతిపై సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సిఎస్ సమీక్ష చేశారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ, మధ్యతర, చిన్నతరహా పరిశ్రమలలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలలో వివిధ విభాగాలు సమన్వయంతో తనిఖీలు నిర్వహించుకోవడానికి జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ (ఉమ్మడి తనిఖీ బృందాలు) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల నివారణకు రెగ్యులర్ మానిటరింగ్ ఉండే విధంగా అధికారులతో తనిఖీ నిర్వహించాలని అన్నారు. జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, పరిశ్రమలు, కార్మిక, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి శాఖల అధికారులతో కూడిన తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి ఆ వివరాలను ఆన్ లైన్ లో (డాష్ బోర్డ్) పొందుపరిస్తే అన్ని విభాగాల అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని సీఎస్ అన్నారు. పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు, భద్రతా ఆడిట్, అలాగే కార్మికుల భద్రతకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని సి.ఎస్ సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అరవింద్ కుమార్, సంజయ్ కుమార్, దాన కిషోర్, ఫైర్ సర్వీస్స్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్, సంగారెడ్డి కలెక్టర్ ప్రవీణ్య, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కమిషనర్ శశాంక, కాలుష్య నియంత్రణ మండలి (PCB) మెంబర్ సెక్రటరీ రవి, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.