రేషన్ బియ్యం నాణ్యతలో రాజీ పడొద్దు: పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

  • బాగ్ లింగంపల్లి గోదాములో ఆకస్మిక తనిఖీ చేసిన పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్

హైదరాబాద్ : పేద ప్రజలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యంతో భోజనం చేయాలన్న మహత్తర సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి మరియు ఎక్స్-ఆఫిషియో కమిషనర్ శ్రీ ఎం. స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ గారు తెలిపారు. బియ్యం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని ఆయన అధికారులను కఠినంగా ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లిలో ఉన్న సివిల్ సప్లైస్ గోదామును కమిషనర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దాదాపు రెండు గంటలపాటు గోదాములో నిల్వ ఉన్న బియ్యం సంచులను యాదృచ్ఛికంగా తెరిపించి నాణ్యతను స్వయంగా పరిశీలించారు. బియ్యం లో నూకల శాతం, తేమ శాతం వంటి అంశాలపై అధికారులను ప్రశ్నించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గోదాముకు వచ్చిన బియ్యాన్ని స్వీకరించే దశలోనే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిల్వలను తిరస్కరించాలని గోదాం ఇన్‌చార్జీలకు సూచించారు. ఈ విషయంలో ఏం మాత్రం రాచి పడిన కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ప్రజలకు చేరే ప్రతి బియ్యం గింజ నాణ్యమైనదిగా ఉండేలా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. సరఫరా వ్యవస్థలో పారదర్శకత కోసం స్టాక్ రిజిస్టర్లు, ఇన్‌వర్డ్–అవుట్‌వర్డ్ వివరాలు, రవాణా రికార్డులను కమిషనర్ పరిశీలించారు. రేషన్ షాపులకు బియ్యం సరఫరాలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదాములో పని చేస్తున్న హమాలీలతో మాట్లాడిన కమిషనర్ గారు వారి పనివాతావరణం, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. “ప్రజల విశ్వాసమే మా బలం. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే నాణ్యతే ప్రమాణం కావాలి. రేషన్ బియ్యం విషయంలో చిన్న తప్పిదం కూడా సహించము,” అని కమిషనర్ గారు స్పష్టం చేశారు. ఈ తనిఖీ లో హైదరాబాద్ జిల్లా మేనేజర్ శ్రీ కె. సాయి అరుణ్, అదనపు జిల్లా మేనేజర్ శ్రీమతి దీప్తి, గోదాం ఇన్‌చార్జీలు శ్రీ గోపాలకృష్ణ, శ్రీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.