రాష్ట్రంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగనున్న పత్తి కొనుగోళ్లు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • వ్యవసాయశాఖ మంత్రి గారి అభ్యర్థన మేరకు పత్తి కొనుగోళ్లను ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించిన సీసీఐ
  • రాష్ట్రంలో పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించాలని ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ని కోరిన మంత్రి తుమ్మల
  • పొడిగించిన గడువును వినియోగించుకొని పత్తిని అమ్ముకోవాలని పత్తి రైతులను కోరిన మంత్రి తుమ్మల

రాష్ట్ర ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు, రాష్ట్రంలోని పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా, ఫిబ్రవరి నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లను కొనసాగించాలని Cotton Corporation of India (సీసీఐ) అంగీకరించినట్లు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. రైతుల ప్రయోజనాలను ప్రాధాన్యంగా తీసుకొని కొనుగోళ్ల గడువును పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం మరియు సీసీఐ దృష్టికి తీసుకెళ్లగా, వారు సానుకూలంగా స్పందించారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో పత్తి సాగు ఆలస్యంగా ప్రారంభమవడంతో దిగుబడులు కూడా ఆలస్యంగా మార్కెట్‌కు వస్తున్నాయి. ఈ వాస్తవ పరిస్థితిని కేంద్రానికి వివరిస్తూ కొనుగోళ్ల గడువును పొడిగించాలని మంత్రి గారు కోరారు. అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో రాష్ట్ర పరిస్థితిని వివరించి, రైతులకు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం 45.32 లక్షల ఎకరాలలో పత్తిని సాగు చేయగా, 28.29 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేయడం జరిగింది. ఇప్పటివరకు 8,80,053 మంది రైతుల నుంచి రూ.12,823 కోట్ల విలువైన 16.15 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. అదేవిధంగా ఇప్పటివరకు మార్కెట్ ద్వారా 2.24 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యత ప్రమాణాలు లేని పత్తిని కోనుగోలు చేయడం జరిగింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఇంకా 9.99 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి రైతుల వద్ద ఉందని మార్కెటింగ్ అధికారులు అంచనా వేయడం జరిగిందన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చిన కపాస్ కిసాన్ పై మొదట రైతులు మరియు జిన్నర్ల నుండి వ్యతిరేకత వచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన యాప్ కి రాష్ట్ర ప్రభుత్వం సపోర్టు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దీంతో ఈ యాప్ ద్వారా రైతులు క్యూలలో నిలబడే అవకాశం లేకుండా, సమయపాలన పాటిస్తూ, రైతులకు దగ్గరలోని పత్తి కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించుకునే అవకాశం కలగడంతో పాటు, పత్తి కొనుగోళ్లను రెగ్యులేట్ చేస్తూ, పారదర్శకంగా కొనుగోళ్లను చేపట్టే వెసులుబాటు కలిగిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో రైతులకు సమయానికి ఎరువుల పంపిణీకి తమ సర్కారు మొబైల్ యూరియా బుకింగ్ యాప్ ని తీసుకొచ్చిందన్నారు. తద్వారా యూరియా బ్లాక్ మార్కెటింగ్ అరికట్టడంతో పాటు అధిక నిల్వలను నియంత్రిస్తూ పారదర్శక పంపిణీ వ్యవస్థ అమల్లోకి వచ్చిందన్నారు. పంట పూర్తిగా మార్కెట్‌కు రాకముందే సీసీఐ వారు పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తారనే సమాచారంతో రైతుల్లో ఆందోళన నెలకొందని, నాణ్యమైన పత్తిని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందనే భయం రైతుల్లో ఉన్న నేపథ్యంలో, మరో 30 రోజులు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలని మంత్రి తుమ్మల సీసీఐను ప్రత్యేకంగా కోరారు. రాష్ట్రంలోని ప్రతి పత్తి రైతు తన పంటను పూర్తిగా విక్రయించే వరకు కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంచాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా మరియు కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ కుమార్‌లకు మంత్రి ఆదేశాలతో నిన్న వ్యవసాయశాఖ సెక్రటరీ లేఖ రాశారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనుగోళ్ల గడువు పొడిగించడంతో రైతులకు ఉపశమనం లభించిందని మంత్రి తెలిపారు. పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకొని రైతులు సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని మంత్రి కోరారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.