జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మీడియా అకాడమి కట్టుబడి ఉంది: చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ మీడియా అకాడమి కట్టుబడి ఉందని చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారంనాడు తెలంగాణ మీడియా అకాడమిలోని కాన్ఫరెన్సు హలులో 2వ పాలకమండలి సమావేశం చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని 8 జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు శిక్షణా కార్యక్రమాలు, వివిధ అంశాలపై 7 వర్క్ షాప్ లు, 12 మంది సీనియర్ జర్నలిస్టులు చేసిన సేవలను రాబోయే తరాలకు తెలియపర్చాలనే ఉద్దేశ్యంతో వారి జీవితాలపై మోనోగ్రాఫ్స్ (చిరు పుస్తకాలు) ముద్రించినట్లు ఆయన తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా విడతల వారీగా 120 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం, 5 సంవత్సరాల కాల పరిమితితో నెలకు 3 వేల రూపాయల పెన్షన్ సదుపాయం కల్పించినట్లు ఆయన వివరించారు. అదే విధంగా అనారోగ్యం, ప్రమాదాలకు గురైన 19 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయం చేశామన్నారు. అకాడమి భవన నిర్వహణలో భాగంగా 250 మంది సీటింగ్ కెపాసిటీ గల ఆడిటోరియం అద్దెకు ఇవ్వడానికి సమావేశంలో చర్చించగా కమిటీ సభ్యులు తమ ఆమోదం తెలుపడం పట్ల కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మీడియా అకాడమి భవన నిర్వహణలో భాగంగా ఆడిటోరియం అద్దెకు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తునే ఈ విధానం పూర్తిగా ఆన్ లైన్ విధానం ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకునే విధంగా మీడియా అకాడమి వెబ్ సైట్లో ఆయా తేదీలు, సమయ పాలనని పొందుపర్చాలని సూచించారు. అప్పుడే పూర్తి పారదర్శకత చేకూరుతుందని వారు వెల్లడించారు. అందుకోసం ప్రభుత్వ ఆధీనంలోని రవీంద్రభారతి, జె.ఎన్.టి.యూ., సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయాకు సంబంధించిన విధి, విధానాలను అధ్యయనం చేసి అద్దెకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని మీడియా అకాడమి కార్యదర్శికి సూచించారు. ఈ పాలక మండలి సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ శ్రీమతి సి.హెచ్. ప్రియాంక, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్టుమెంట్ హెడ్ డాక్టర్ సతీష్ కుమార్ తల్లాడి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఇంచార్జి హెడ్ డా. సునిల్ కుమార్ పోతన, దూరదర్శన్ కేంద్ర ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్రీమతి ఎ. చాందిని, ఆల్ ఇండియా రేడియే ప్రోగ్రామ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. రమేష్ సుంకసారి, స్పెషల్ గెస్ట్ వీర నారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్టుమెంట్ హెడ్ బి.వి. కృష్ణాజీరావు, తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.