- గౌరెల్లి ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
- చట్టపరమైన అవంతారాలను అధిగమిస్తాం
- న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి ప్రక్రియ మొదలు పెట్టాం
- భూసేకరణ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి
- రైతులకు న్యాయపరమైన చెల్లింపులు
- జూన్ 2 కు ముందే భూసేకరణకు నిధులు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత క్రమంలో నిర్మించే ప్రాజెక్టులలో గౌరెల్లి ప్రాజెక్టు ముఖ్యమైనదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. లక్షా 06 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులుతో పాటు న్యాయపరమైన చిక్కులు ఏర్పడడంతో పనులు మందగించాయన్నారు. అయితే అటువంటి అవంతారాలను అధిగమించి త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన సుస్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా అక్కనపెట మండలంలోనీ గౌరెల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పురోగతిపై సోమవారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలసి ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖా సలహాదారుడు ఆదిత్య దాస్ నాధ్,ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్&ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు, ఇ. ఎన్.సి జెనరల్ రమేష్ బాబు లతో పాటు కరీంనగర్, జనగామ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వరద కాలువ ద్వారా వచ్చే నీటితో సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం గౌరెల్లి గ్రామంలో 1.41 టి.యం.సిల నీటితో ఈ రిజర్వాయర్ నిర్మాణం ప్రతిపాదించగా అంచనాలు సవరించి 8.23 టి.యం.సి ల సామర్ధ్యానికి పెంచి అదనపు ఆయాకట్టు సేద్యంలోకి తేవాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి సవరించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు పెట్టమన్నారు. అయితే అదే సమయంలో భూసేకరణ విషయంలో రైతులకు అందించే చెల్లింపులు న్యాయబద్ధంగా ఉండడంతో పాటు సకాలంలో నిధుల మంజూరుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. గౌరెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణకు అవసరమైన నిధులను జూన్ 2 ముందే విడుదల చేస్తామని అందుకు సంబంధించిన ప్రక్రియను సకాలంలో పూర్తి చేయలని ఆయన కరీంనగర్, జనగామ, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. న్యాయపరమైన అంశాలను ఎదుర్కొంటున్న గౌరెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన కేసు మరో రెందు రోజుల్లో విచారణకు రానున్న సందర్భంలో చిక్కులను అధిగమించెందుకు అవసరమైన వ్యూహం తో సిద్ధంగా ఉండాలని సమీక్షలో పాల్గొన్న అడ్వకేట్ జెనరల్ ను ఆయన ఆదేశించారు.
అనేక ఆవాంతరాలతో అర్దాంతరంగా నిలిచి పోయిన గౌరెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అన్నివైపులా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇక పై నిధుల కేటాయింపులలో కుడా ఎటువంటి అలసత్వానికి అవకాశం లేకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఇదే సమీక్షలో పాల్గొన్న రవాణ,బి.సి సంక్షేమ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిరంతరం ఒత్తిడి పెంచుతున్నామని అందుకు సంబంధించిన భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్దేశించిన రీతిలో దేవాదుల,గౌరెల్లి తో సహా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను పూర్తి చేయాలన్నారు. పట్టణీకరణ వేగవంతంగా పెరుగుతున్న నేపద్యంలో భూముల ధరలు పెరగడంతో రైతులు పెద్ద మొత్తంలో నష్టపరిహారం కోరుకుంటున్నారని అందుకు సంబంధించిన విధాన నిర్ణయాలు న్యాయపరంగా తీసుకోవాలని సూచించారు. గౌరెల్లి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖా సలహాదారు ఆదిత్య దాస్ నాధ్ కు సూచించారు.