డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలి

కొత్తగా జారీ చేసిన జీవో నెంబర్‌ 252ను సవరించి డెస్కు జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు మంజూరు చేయాలని డెస్క్‌ జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం డెస్క్‌జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన డెస్క్‌ జర్నలిస్టులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా డెస్క్‌ జర్నలిస్టులకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడారు. గతంలో జిల్లాల ప్రాతిపదికన ఒక్కో జిల్లా డెస్క్‌కు ఐదేసి చొప్పున, ఎడిషన్‌ కేంద్రం ఉండే జిల్లాకు మరో మూడు కార్డులు అదనంగా మంజూరు చేశారని గుర్తు చేశారు. అప్పుడు ప్రధాన పత్రికలకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఎనిమిది జిల్లాలకు 43 కార్డులు వచ్చాయని చెప్పారు. కానీ, ప్రస్తుతం ఎడిషన్‌ కేంద్రంగా నాలుగు కార్డులు మాత్రమే అందిస్తామని చెప్పడం దారుణమన్నారు. తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. డెస్కులో పనిచేసే జర్నలిస్టులంతా 15 నుంచి 20 ఏళ్ల సీనియార్టీ ఉన్నవారే ఉన్నారని, వారికి అన్యాయం చేయొద్దని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం పునాలోచన చేయాలని, జీవో 252ని సవరించి అర్హులందరికీ అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌కు వినతిపత్రం అందజేశారు. వీరికి టీయూడబ్ల్యూజే(143) జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ, నాయకులు సీహెచ్‌ వేణుగోపాలరావు, జేరిపోతుల సంపత్‌, బీ వెంకటేశ్‌, టీయూడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా కార్యదర్శి బాపురావు, తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. నిరసనలో డెస్క్‌ జర్నలిస్టుల ఫోరం అడ్‌హక్‌ కమిటీ కన్వీనర్‌ పోలు సంపత్‌, కోకన్వీనర్లు అల్లాడి శ్రీనివాస్‌, బాడిసె సంపత్‌కుమార్‌, దాముక రాజశేఖర్‌, దుబ్బాక శ్రీనివాస్‌, బొమ్మరవేని బాలకృష్ణ, గంగిళ్ల జీవన్‌రెడ్డి, గోసికొండ ప్రవీణ్‌, బోయిని సంపత్‌, పలు పత్రికల డెస్కు జర్నలిస్టులు పాల్గొన్నారు.