- వెలుగుమెట్లలో 2023లో ఇళ్లు కూలగొట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వమే
- బాధితులకు ఇంటిస్ధలం, ఇళ్లు ఇచ్చే బాధ్యత మాది
- ప్రభుత్వ ప్రగతిని చూడలేని కేసీఆర్ & కో విష ప్రచారం
- వరుస ఎన్నికల్లో ప్రజల బుద్ది చెబుతున్నా మారని బిఆర్ఎస్ వైఖరి
- కాళేశ్వరం ప్రాజెక్ట్ లో బిఆర్ఎస్ అవినీతికి బిజేపీ సహకారం
- కేసీఆర్ అసెంబ్లీకి రావాలి- మంచి సలహాలు సూచనలు ఇవ్వాలి
- మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ స్పష్టీకరణ
హైదరాబాద్:- రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు జరిగిన పార్లమెంటు, ఉప ఎన్నికలు, పంచాయితీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష బిఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నారని, దీనికి మరోవైపు బిజేపీ నేతలు వంతపాడుతున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. గురువారం నాడు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ బలరాం నాయిక్, రామ సహాయం రఘుమారెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, మాధవరెడ్డితో కలసి మాట్లాడారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ …2023 జూలై 15న వెలుగుమట్లలో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వమే పేదల ఇండ్లను కూలగొట్టించిందని చెబుతూ నాడు కూల్చివేత సంఘటనల ఫోటోలను ప్రదర్శించారు. అంతేగాక వెలుగుమెట్లలో పేదలకు ఇండ్లు తిరిగి కట్టిస్తామని హామీ ఇచ్చి గాలికి వదిలేసింది. కానీ ఇందిరమ్మ ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా అక్కడ అక్రమంగా ఉన్న ఇండ్లను తొలగించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు అక్కడ అర్హులైన పేదలకు ఇంటి స్ధలం, ఇళ్లు ఇస్తాం. పేదలే ఇందిరమ్మ ప్రభుత్వం పెటెంట్. ఈవిషయంలో నిజంగా పేదలపై బిఆర్ఎస్ బావ మరుదులు, ఫాంహౌస్ లో ఉండి కుట్రలు చేస్తున్న కేసీఆర్ వెంటనే స్పందించి కాళేశ్వరంలో దోచుకున్న, దాచుకున్న సొమ్ములో కొంత భాగాన్ని బయటకు తీసి పేదలకు ఇళ్లు కట్టించి పాప పరిహారం చేసుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను కాదని కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ ను చేపట్టి ఎనిమిదవ వింతగా ప్రచారం చేసుకుంది. వారి హయాంలోనే లక్షలాది కోట్ల ప్రాజెక్ట్ కట్టడం, అవినీతి కారణంగా బీటలువారడం కూడా జరిగింది. నాలుగేళ్లలో 168 టిఎమ్‌సీ నీరు ఇస్తామని చెప్పి దీనిలో 50 టిఎంసీల నీటిని సముద్రం పాలుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ బిఆర్ఎస్ కు ఎటీఎం గా మారిందన్న బిజేపీ నేతలు బిఆర్ఎస్ తో చేతులు కలిపారు. జస్టిస్ ఘోష్ కమీషన్ నివేదిక ఇచ్చినా, అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐకి ఇచ్చినా ఇంతవరకు కేంద్రం కనీసం స్పందించలేదు.బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో వదిలేసిన ప్రాజెక్ట్ లను మేం పూర్తి చేస్తున్నాం. 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీకి కేసీఆర్, బావ బావమరుదులు వచ్చి మాట్లాడాలి. వారు గతంలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. మేం కచ్చితంగా అవకాశం ఇస్తాం.వచ్చి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలి.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..బిఆర్ఎస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్ట్‌ల విషయంలో ఉత్తర తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసింది. 196 టిఎంసీల నీరు ఇస్తామని చెప్పి 168 టీఎంసీలకు పరిమితం చేసింది. 50 టీఎంసీలు సముద్రంలో కలిపింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. మా ప్రభుత్వం వచ్చాక శ్వేత పత్రం ఇచ్చాం. కాళేశ్వరంపై చర్చించాం. కేంద్రం చర్యలు కోరాం. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 48వేల కోట్లు మిత్తీగా కట్టింది. కేంద్రప్రభుత్వం ఇకనైనా నిధులు ఇవ్వాలి అని కోరారు.
మంత్రి వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ .. బిఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడినందును దేశంలోని ప్రాంతీయ పార్టీల్లోకెల్లా ధనిక పార్టీగా మారింది.సుమారు వెయ్యి కోట్ల రూపాయిల ఫిక్స్‌డ్ డిపాజిట్లు , ఎలక్ట్రోరల్ బాండ్లు దీనికి నిదర్శనం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని కేసీఆర్ నుంచి వసూలు చేయాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్లు, కాసుల కోసమే బిఆర్ఎస్ అనుకూల నీటిప్రాజెక్ట్‌లను చేపట్టింది.