అగ్నిమాపక శాఖలో వసతులు వివరించండి : హైకోర్టు

 అగ్నిమాపకశాఖలో విపత్తులను ఎదురొనేందుకు ఉన్న సదుపాయాలను వివరించాలని కోరుతూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. సౌకర్యాలు, వనరులు, సాంకేతికత, పరికరాల పరిస్థితులను తెలియజేయాలని చెప్పింది. ఇప్పుడున్న యంత్రాల పనితీరు, ఆక్సిజన్‌ మాస్‌లు, నీటి సౌకర్యాలు తదితర వివరాలు నివేదించాలని సూచించింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం గురువారం ఆదేశించింది. 2025లో పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో అగ్నిప్రమాదం జరిగి 17 మంది మరణించిన ఘటనపై విశ్రాంత న్యాయమూర్తితో జ్యుడీషియల్‌ వి చారణకు ఆదేశాలు ఇవ్వాలంటూ అందిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది. అగ్నిమాపకశాఖలో అత్యాధునిక వసతులు లేకపోవడంతో ప్రాణనష్టం జరిగిందని లేఖలో పేరొన్నారు. ముందుగా తెలియజేసినప్పటికీ సకాలంలో అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్‌లు రాలేదని తెలిపారు. ఈ కేసులో ప్రతివాదులైన హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌, వైద్యఆరోగ్య శాఖ డైరెక్టర్‌, సిటీ పోలీసు కమిషనర్‌కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.