భూదాన్ భూములు వ్యవహారంలో కార్యకర్తలు సంయమనం పాటించాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • అర్హులైన పేదలను గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ను ఆదేశించాను.
  • అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చి ప్రభుత్వం అండగా ఉంటుంది

భూదాన్ భూముల వ్యవహారంలో జరుగుతున్న ప్రచారం పట్ల ఆవేశానికి లోనుకాకుండా కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించాలని కోరుతున్నాను. ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్న కొందరు రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు, సోషల్ మీడియా వ్యక్తుల పై కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. పేదల పట్ల మన నిబద్ధత, మానవీయ కోణం రేపటి నాడు స్పష్టమయ్యాక వాళ్లు కూడా ప్రభుత్వ చర్యను సమర్ధించాల్సిన పరిస్థితి వస్తుంది.
భూదాన్ భూముల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో గూడు ఇచ్చే బాధ్యత నాది. పేదల సంఘం ముసుగులో విలువైన ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అన్యాక్రాంతం చేసి, పేదలను అడ్డు పెట్టుకుని సొమ్ము చేసుకుంటుంటే బాధ్యత గల ప్రభుత్వంగా చూస్తూ ఊరుకోదు. అక్రమార్కుల పై చర్యల విషయంలో ఎంత కఠినంగా ఉంటామో, పేదల విషయంలో అంతే మానవీయంగా ఉంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా ప్రభుత్వంలో ఏ పేదవాడికి అన్యాయం జరగదు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టింది, గృహ ప్రవేశాలు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను.
అక్రమార్కుల చేతిలో మోసపోయి, హక్కు లేని భూమిలో, కబ్జాదారుల్లాగా బతకాల్సిన ఖర్మ పేదలకు లేదు. గత ఆరేడేళ్లుగా భూదాన్ భూముల్లో కనీస సదుపాయాలు లేని దుర్భర పరిస్థితుల్లో పేదలు బతుకుతున్నారు. కరెంట్, డ్రైనేజీ, తాగేందుకు కనీసం మంచినీటి వసతి, సరైన రోడ్లు కూడా లేని దుస్థితి అక్కడ ఉంది. కొందరు కబ్జాదారుల చర్యలతో అన్యాక్రాంతమైనందువల్ల అక్కడ కనీస సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఈ ప్రభుత్వంలో పేదలు ఇంత దుర్భర బతుకులు బతకాల్సిన అవసరం లేదు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి, సకల సౌకర్యాలతో, మీ ఇంటిపై మీకు సంపూర్ణ హక్కులతో, ఆత్మగౌరవంతో బతికేలా మీ తరఫున నేను ఉన్నానని భరోసా ఇస్తున్నాను. దోపిడీదారులు, భూకబ్జాదారుల మాటలకు లోనై ఆందోళన చెందవద్దు అని పేదలకు పిలుపునిస్తున్నాను. సోషల్ మీడియా వార్తలపై పోలీస్ పిర్యాదులు వద్దని కార్యకర్తలను కోరుతున్నాను. భూదాన్ భూముల అక్రమార్కులు పై ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. పేదల సంఘం పేరుతో భూ దందాను ఉపేక్షించం.

పేదల వెరిఫికేషన్ వేగంగా సాగుతోంది.
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో నేను పేదలకు చేసిన సేవ జిల్లా ప్రజానీకానికి తెలుసు. కమ్యూనిస్ట్ పార్టీలకు నా నిబద్ధత తెలుసు. పేదల సంఘం పేరుతో సాగుతున్న భూదందా పై కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఖండించారు. వాస్తవాలు కప్పి పుచ్చి అక్రమార్కులకు వంత పాడిన వారి గూర్చి ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా వార్తలపై పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పేదల సంఘం చేతిలో మోస పోయిన పేదలకు మానవీయ కోణంలో ప్రభుత్వం అండగా ఉంటుంది. భూదాన్ భూములు అక్రమాల పై ప్రభుత్వం విచారణ సాగుతుంది. పేదల ముసుగులో ఓ సంఘం చేసిన దోపిడి పై వచ్చిన పిర్యాదులు ఆధారంగా విచారణ సాగుతుంది. విచారణ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు సంయమనం పాటించాలి. యూట్యూబ్ జర్నలిస్ట్ లపై పోలీస్ పిర్యాదులు వద్దు. విచారణ పూర్తయ్యాక నిజాలు వెలుగులోకి వస్తాయని, వాస్తవాలు తెలిసి ఆ జర్నలిస్ట్ లు పశ్చాత్తాప పడతారు. దుష్ఫ్రచారం చేసే ప్రతిపక్ష నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అబివృద్ధి ధ్యేయంగా, పేదల సంక్షేమమే ప్రాధాన్యంగా పని చేశాను. ఇకపై అంతే నిబద్ధతతో ప్రజలకు సేవ చేస్తాను.

కలెక్టరేట్ పక్కనే ప్రభుత్వ స్థలంలో అమాయక పేదలకు నకిలీ పట్టాలు ఇచ్చి.. వారితో గుడిసెలు వేయించి పేదల సంఘం పేరుతో లక్షలు రూపాయలు వసూళ్లు చేసి చుట్టు పక్కల ప్రైవేట్ స్థలాల వారిపై దౌర్జన్యం చేస్తుంటే ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంది. దీనిని రాజకీయ దుమారంగా మార్చి పబ్బం గడుపుకోవాలని కొందరు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టే ప్రభుత్వానికి వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు కట్టించి ఇవ్వడం భారమా!? వెలుగుమట్ల భూదాన్ భూములు ఆక్రమణలో పేదల సంఘం చేసిన మోసాలు బయటకు రాకుండా ప్రతిపక్ష పార్టీల సహకారంతో సోషల్ మీడియాలో ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేశారు. వాస్తవాలు కమ్యూనిస్ట్ పార్టీలకు తెలుసు కాబట్టే పేదల సంఘం దురాగతాలు వారు కూడా ఖండించారు. భూదాన్ భూములకు నకిలీ పట్టాలు ఇచ్చి పేదలతో గుడిసెలు వేయించి తీరా వారి అక్రమం బయటపడితే.. పేదల వద్ద లక్షలు రూపాయలు వసూళ్లు చేసిన ముఠాపై ప్రభుత్వం ఉదారంగా ఉండాలా ?చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోతే ఇదే అలుసుగా ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం అవ్వవా? అని ప్రజలే ఆలోచన చేయాలి. భూదాన్ భూములు వ్యవహారంలో అర్హులైన పేదలను గుర్తించాల్సిందిగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశాను. పేదల గుర్తింపు వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఇళ్ళు లేని పేదల గుర్తింపు పూర్తవగానే వారికి ఇళ్లు నిర్మాణం చేసేందుకు పది ఎకరాల ప్రభుత్వ స్థలం సిద్ధం చేయాలని కలెక్టర్ కు సూచించాను.

ఖమ్మం లో పేదల కాలనీలకు పునాదులు మావే.
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడుతూ ఖమ్మం నగరంలో పలు కాలనీలు రామన్నపేట దానవాయి గూడెం ధoసలాపురం రమణగుట్ట లో వేలాది పేదలకు ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇచ్చిన మాకు.. వెలుగుమట్ల భూదాన్ భూముల్లో గుడిసెలు వేసిన వారు ఎంత మాత్రం భారం కాదు .పేదల సంఘం ముఠాకు రెక్కల కష్టం దారబోసి మోస పోయిన పేదలకు మానవీయ కోణంలో వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా చెప్పడం నా నిబద్ధతకు నిదర్శనం. పేదల సంఘం పేరుతో ఓ సంఘం చేసిన అరాచకం పై కమ్యూనిస్ట్ పార్టీలు వాస్తవాలు మాట్లాడారు. బాధ్యత లేని ప్రతిపక్ష బీ.ఆర్.ఎస్ మాత్రం పేదలను మోసం చేసిన వారిని కాపాడేలా హంగామా చేయడం రాజకీయ దిగజారుడుతనం.