క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి వాకిటి శ్రీహరి

  • సమీక్షలో పాల్గొన్న MD సోనీ బాలాదేవి, ఇతర అధికారులు
  • వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది మంత్రి వాకిటి శ్రీహరి
  • క్రీడాకారులకు ఆర్ధిక సాయం, ఇతర ప్రోత్సాహకాలపై మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. 2026-2027 బడ్జెట్ లో క్రీడాకారులకు ఆర్ధిక సహాయం, ఇతర వసతులపై డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆ రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా పాలసీ తీసుకు వచ్చి క్రీడలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను ఆటల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. అందులో భాగంగా క్రీడా శాఖకు 2026-2026 బడ్జెట్ లో అధిక నిధుల కేటాయింపుతో పాటు, క్రీడాకారులకు ఆర్ధిక సహాయంపై అధికారులతో చర్చించారు.

ఒలంపిక్, పారా ఒలంపిక్, అంతర్జాతీయ, జాతీయ ఆటల పోటీల్లో పతకాలు సాధిందించిన వారికి ఆర్ధిక సహాయం అందించేలా బడ్జెట్ లో కేటాయింపులు ఉండేలా ప్రతిపాదనలు పంపాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పాఠశాల విద్య నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఆటల్లో ప్రతిభ కనబరుస్తున్న వారికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సహంతోనే విద్యార్ధి, యువకులు క్రీడల్లో రాణిస్తారని మంత్రి వాకిటి శ్రీహరి వివరించారు. క్రీడాకారులకు ఇచ్చే పారితోషికాలపై విధివిధానాలు రూపొందించాలని, వాటిని నిష్పక్షపాతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ MD సోనీ బాలాదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.