- పిసిబిలో కాంప్లియన్స్ వెరిఫికేషన్ కాదు అది “కరప్షన్ వెరిఫికేషన్”
- జోనల్ ల్యాబ్ వరంగల్ లో ఉన్నతాధికారి విచ్చలవిడి అవినీతి దందా..
- అక్కడ ఆయన ఆడిందే ఆట.. పాడిందే పాట..
- సిబ్బందిపై గుత్తాధిపత్యంతో ఆయన ఇష్టారాజ్యం..
- చూసి చూడనట్లు వదిలేస్తున్న ఉన్నతాధికారులు..
- కాంప్లియన్స్ వెరిఫికేషన్ పేరుతో వారానికి రూ.5 నుంచి రూ.10 లక్షల వసూలు..
- గత మూడేళ్లలో రూ.కోట్లలో అక్రమాస్తుల సంపాదన..
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) జోనల్ ల్యాబ్ వరంగల్ లో ఆ ఉన్నతాధికారి పరిశ్రమలలో కాంప్లియన్స్ వెరిఫికేషన్ పేరుతో వారానికి రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల వసూళ్ల టార్గెట్ పెట్టుకుని ‘వారపు వసూళ్ల’ దందా చేస్తున్న విషయం ఇప్పుడు పిసిబి అధికారుల్లో, పర్యావరణ వర్గాల్లో సంచలనంగా మారింది. వరంగల్ జోనల్ లాబొరేటరీ మరియు హైదరాబాద్ సెంట్రల్ లాబొరేటరీ ఉన్నతాధికారి (SES / JCES-FAC) తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఒక పద్ధతి ప్రకారం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పిసిబి అధికారులు, పర్యావరణ వేత్తల నోట వినిపిస్తున్న మాట. అక్కడ ఉన్న ES ల సపోర్ట్ తో జూనియర్లకు ప్రతి వారం ఒక షెడ్యూల్ను ఖరారు చేసుకొని ఇందులో భాగంగా సుమారు 10 పరిశ్రమలను ఎంపిక చేసి, కాంప్లియన్స్ వెరిఫికేషన్ పేరుతో పరిశ్రమలకు వెళ్ళి అక్కడ హడావిడి చేస్తూ ఫోటోలు తీస్తూ.. పరిశ్రమ మొత్తాన్ని మానిటరింగ్ చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ.. ETP శ్యాంపిల్స్, ఎయిర్ మానిటరింగ్, ఎయిర్ శ్యాంపిల్స్ తీసి పరిశ్రమలలో ఎక్కడలేని హడావిడి చేసి రిపోర్ట్ రాసి పరిశ్రమ వారిని భయబ్రాంతులకు గురి చేసి పరిశ్రమల వారి నుండి రూ.50 వేల నుంచి ఎంత వీలైతే అంత లంచం తీసుకుని ఆ తరువాత ల్యాబ్ లో అనాలసిస్ చేసినట్టు చేసి వ్యాల్యూస్ సరిగానే ఉన్నట్టు రిపోర్ట్ లు ఇస్తారు. వారు అనుకున్న లంచం పరిశ్రమ వారు ఇవ్వకపోతే అనాలసిస్ రిపోర్ట్ లో వ్యాల్యూస్ మారిపోతాయి. అందుకే పరిశ్రమల వారు కూడా పిసిబి అధికారులు అంటే భయపడి వారు ఆడింగింది ముట్టచెప్పడం జరుగుతుంది.
హైదరాబాద్ సెంట్రల్ లాబొరేటరీ ఉన్నతాధికారి (SES / JCES-FAC)గా ఉన్న ఈ ఉన్నతాధికారి వరంగల్ జోనల్ లాబొరేటరీ ని తన షెడ్యూల్ ప్రకారం వారానికి ఒకరోజు సందర్శించడం జరుగుతుంది. ఆ రోజే ఆ ఉన్నతాధికారి కిందిస్థాయి అధికారులకు వారపు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. వారు షెడ్యూల్ ప్రకారం పరిశ్రమలలో కాంప్లియన్స్ వెరిఫికేషన్ చేసి ఒక్కో అధికారి వారానికి సుమారు రూ. 5 లక్షల వరకు వసూలు చేయాలి. ఇలా రెండు లాబొరేటరీల నుండి వారానికి సుమారు రూ. 5 నుండి 10 లక్షల వరకు నేరుగా ఆ ఉన్నతాధికారికి చేరుతున్నట్లు సమాచారం. ఇలా ఈ రెండు అనగా వరంగల్ జోనల్ ల్యాబ్ మరియు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ లాబొరేటరీ నుండి రూ. 5 నుంచి 10 కోట్లు అక్రమార్గంలో సంపాదించినట్లు సమాచారం. గత మూడేళ్లుగా వరంగల్ జోనల్ ల్యాబ్ లో ఈ విధానాన్ని అమలు చేస్తూ, ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు ఈ ఉన్నతాధికారిపై అనేక ఆరోపణలు ఉన్నాయి.
గత మూడేళ్లుగా వరంగల్ జోనల్ ల్యాబ్ అధికారులు కాంప్లియన్స్ వెరిఫికేషన్ లో భాగంగా ఆయా పరిశ్రమల సందర్శనలో అనాలసిస్ రిపోర్ట్స్ (Analysis Reports)లో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన లేదని (100% Compliance) క్లీన్ చిట్ ఇస్తున్నారు. ఈ అధికారి వరంగల్ జోనల్ ల్యాబ్ లోని అధికారులతో పరిశ్రమలలో కాంప్లియన్స్ వెరిఫికేషన్ చేపించి తను అనుకున్న విధంగా లంచం ముట్టడంతో అట్టి రిపోర్ట్స్ లో 100% Compliance ఇస్తూ ఒక్కటి అంటే ఒక్కటి కూడా Non Compliance ఇవ్వడం లేదంటేనే అర్దం చేసుకుకోవచ్చు ఈయనగారి అవినీతి ఏ రేంజ్ లో ఉందో.. ఈ ఉన్నతాధికారి వరంగల్ జోనల్ ల్యాబ్ పరిధిలో చేసిన కాంప్లియన్స్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ లాబొరేటరీ పరిధిలోని పరిశ్రమలలో కూడా అమలు చేస్తున్నాడు అని పిసిబి అధికారులే చెబుతున్నారు. ఈ అధికారి విచ్చలవిడి అవినీతిపై చైర్మన్ మరియు మెంబర్ సెక్రటరీలు వెంటనే స్పందించి గత మూడేళ్లలో ఈ ఉన్నతాధికారి జూనియర్లకు కేటాయించిన వారపు షెడ్యూల్స్ మరియు దాని ఆధారంగా తయారైన విశ్లేషణ నివేదికలను (Analysis Reports) తక్షణమే సీజ్ చేసి ఎన్ని పరిశ్రమలలో కాంప్లియన్స్ వెరిఫికేషన్ పేరిట (Analysis Reports) రిపోర్టులలో Non Compliance అనేవే లేకుండా 100% Compliance ఇచ్చిన నివేదికలపై వెంటేనే నిజాయితీ కలిగిన అధికారులతో ఓ కమిటీ లేదా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులతో విచారణ జరిపించాలి అని పలువురు పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఇట్టి విచారణ పూర్తయ్యే వరకు ఈ ఉన్నతాధికారిని బాధ్యతల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా సంపాధించిన రూ. 5 నుండి రూ. 10 కోట్ల రూపాయల సొమ్ము మరియు అక్రమాస్తులపై ఏసీబీ (ACB) చేత లోతైన దర్యాప్తు చేయించాలని పలువురు పర్యావరణ వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఉన్నతాధికారి అవినీతి కథ ఇంతటితో ముగియలేదు.. ఈయనగారి అవినీతిలీలలు రాబోయే మరో కథనంలో.. పిసిబి అవినీతి అధికారుల బాగోతం వరుస కథనాల ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్నాం.. తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడుకోవడమే మా లక్ష్యం.. అవినీతి అధికారులపైనే మా పోరాటం..