లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ అధికారి

రిటైర్మెంట్‌ బెనిఫిట్ల ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపడానికి లంచం డిమాండ్‌ చేసిన జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోన్‌ ఎగ్జామినర్‌ అకౌంట్స్‌ మేనేజర్‌ సంతోష్‌ కుమార్‌ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కరు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ జోన్‌ కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగిగా పని చేసి గతేడాది అక్టోబరులో రిటైరైన ఆంజనేయులు తనకు రావాల్సిన రిటైర్మెంట్‌ బెనిఫిట్ల కోసం దరఖాస్తు చేశాడు. కానీ, ఐదు నెలలు కావస్తున్నా.. తన రిటైర్మెంట్‌ బెనిఫిట్ల ఫైల్‌ కదలకపోవడంతో బుధవారం ఆంజనేయులు సికింద్రాబాద్‌ జోన్‌ కార్యాలయానికెళ్లి ఎగ్జామినర్‌ అకౌంట్స్‌ మేనేజర్‌ సంతో్‌షకుమార్‌ను కలిశాడు. సదరు ఫైల్‌ను అధికారులకు పంపాలంటే తనకు రూ.40 వేలు లంచం ఇవ్వాలన్న సంతో్‌షకుమార్‌తో తానంత ఇవ్వలేనని రూ.35 వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ, లంచమివ్వడం ఇష్టం లేని ఆంజనేయులు ఏసీబీని సంప్రదించాడు. వారి సూచన మేరకు జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం 4 గంటలకు సంతోష్‌ కుమార్‌కు ఆంజనేయులు డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.