మహిళల రక్షణ.. సామాజిక బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

  • మగవారే బ్రాండ్‌ అంబాసిడర్లుగా నిలవాలి
  • అమ్మాయిలపై నిందలు వేయడాన్ని మానుకోవాలి
  • ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ ప్రారంభంలో సీఎం రేవంత్‌రెడ్డి

 మహిళలు ధైర్యంగా తమ పనులు చేసుకునేందుకు రక్షణగా చట్టాలు చేస్తేనో, పోలీసులు పహారా కాస్తేనో సరిపోదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహిళల రక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. మహిళల రక్షణ కోసం మగవారే బ్రాండ్‌ అంబాసిడర్లుగా నిలవాలని సూచించారు. సహాయంగా నిలివారికే గౌరవం, మర్యాద ఉంటాయన్నారు. శనివారం తెలంగాణ పోలీస్‌ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జేఎన్‌టీయూ క్యాంపస్‌ ఆడిటోరియంలో నిర్వహించిన ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ క్యాంపెయిన్‌ను సీఎం ప్రారంభించారు. క్యాంపెయిన్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భంలో కేవలం కార్యక్రమాల నిర్వహణతోనే బాధ్యత తీరిపోయినట్టు కాదన్నారు. కాలేజీలు, కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సినిమా హాళ్లు వంటి ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ‘‘మహిళను శక్తితో పోల్చుతాం. కుటుంబ గౌరవంగా భావిస్తాం. అలాంటిది మహిళలు నిత్యం అభద్రతా భావంతో బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండకూడదు. ఈ దుస్థితిని నివారించేలా మనల్ని మనం సవరించుకోవాల్సిన సమయం వచ్చింది’’ అని సీఎం అన్నారు. ఆడపిల్లలను ఎవరైనా ఇబ్బందికి గురిచేసినప్పుడు నిలబడి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని యువతకు సూచించారు. వేధింపులను చూసీ చూడనట్టు ఉండటం కూడా నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుందన్నారు. సొంత కుటుంబ సభ్యులకు వేధింపులు ఎదురైతే ఎలా స్పందిస్తామో.. ఇతర ఆడపిల్లల విషయంలోనూ అదేవిధంగా ఆలోచించాలన్నారు. ఒక మహిళ సారథ్యంలో ఉన్న పార్టీ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతోందని సీఎం రేవంత్‌ తెలిపారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత కూడా మహిళలకు కీలక పదవులు, బాధ్యతలు కట్టబెట్టిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులోనూ యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ, లోక్‌సభ స్పీకర్‌గా మీరాకుమార్‌లే కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణ పోలీస్‌ శాఖలోని కీలక విభాగాలకు, ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖలకు మహిళలే అధికారులుగా ఉన్నారని, ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతమైతేనే ఆ రాష్ట్రం, దేశం పురోగతి సాధించినట్టుగా భావించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓవైపు మహిళా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆర్థిక స్వావలంబన దిశగా మహిళ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించేలా అమెజాన్‌ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఆడబిడ్డనే స్ఫూర్తిగా ఉండాలని ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నట్లు చెప్పారు.

తెలంగాణ రైజింగ్‌లో మహిళల ముందడుగే కీలకమని, మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడంతోనే రాష్ట్రం మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో మహిళలకు సముచిత అవకాశాలున్నాయి. ఇంకా ధైర్యంగా రాణించాలంటే రక్షణ ఉండాలి. ఎవరైనా వాళ్లకు ఇబ్బంది కలిగించినప్పుడు నిలబడి ప్రశ్నించేతత్వం తెచ్చుకోవాలి. మాకెందుకులే అని చూసీ చూడనట్లుగా ఉండడం ఒక రకంగా నేరాన్ని ప్రోత్సహించడమే అవుతుంది. ఫిజికల్‌ క్రైమ్‌ కంటే సోషల్‌ మీడియా, సైబర్‌ క్రైమ్‌ పెరిగిపోయాయి. ఆడపిల్లలను వేధించడానికి టెక్నాలజీని కూడా ఎక్కువ వినియోగిస్తున్నారు. డీప్‌ ఫేక్‌ వీడియోలను తయారు చేస్తున్నారు. వీటన్నింటినీ ప్రభుత్వం నియంత్రించడానికి సైబర్‌ క్రైమ్‌ విభాగం పూర్తిస్థాయిలో పని చేస్తుంది’’ అని సీఎం అన్నారు. ఏదైనా జరిగినప్పుడు అమ్మాయిదే తప్పు.. అని నిందలు వేసే చెడు సంప్రదాయాన్ని వదులుకోవాలన్నారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళల కోసం ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ అనే నినాదం తీసుకొని వారికి అండగా నిలవాలని సూచించారు. ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ బ్రాండ్‌ అంబాసిడర్‌, సినీ హీరో సాయిదుర్గా తేజ్‌ మాట్లాడుతూ.. ప్రతి మహిళలో తమ తల్లిని చూసుకొని గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ శివధర్‌రెడ్డి, మహిళా భద్రతా విభాగం అడిషనల్‌ డీజీ చారుసిన్హా, సైబర్‌ సెక్యూరిటీ విభాగం డీజీ షికాగోయల్‌, ఉమెన్‌ సేఫ్టీ అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా, హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు.