విజయ బ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి ప్యాకెట్లతో పాటు డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తూ తెలంగాణ విజయ బ్రాండ్ పేరును దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. లాలాపేట్‌లోని విజయ డెయిరీ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రైవేట్ డెయిరీల తీరును ఖండించారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభజన జరిగాక రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా సంబంధిత ఫెడరేషన్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. విజయ బ్రాండ్ అనేది ఇప్పటికీఉమ్మడి హక్కుగానే ఉందని తెలిపారు. కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ విజయ డెయిరీ ఫెడరేషన్ విజయ బ్రాండ్‌పై ప్రైవేటు డెయిరీలకు ప్రాంచైజీ హక్కులను కల్పించి వాటితో కార్యకలాపాలు చేయిస్తుందని ఆరోపించారు. ఆ ప్రైవేటు డెయిరీలు విజయ బ్రాండ్ పేరుతో నకిలీ నెయ్యి ప్యాకెట్లతో పాటు పాలు, పెరుగు ప్యాకెట్లను విచ్చలవిడిగా మార్కెట్లో అమ్ముతున్నాయని మండిపడ్డారు. తద్వారా తెలంగాణ విజయ బ్రాండ్ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించి ఏపీ ఫెడరేషన్ ప్రైవేటు డెయిరీలకు కల్పించిన ప్రాంచైజీ హక్కులను రద్దు చేయాలని, లేని పక్షంలో న్యాయబద్ధంగా పోరాడతామని స్పష్టం చేశారు.