హైదరాబాద్ : దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఇక్కడి ప్రజాభవన్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రత్యేక అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలకే పెద్దపీట వేస్తున్నామని దీనిలో భాగంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే ప్రక్రియలో భాగంగా సున్నా శాతం వడ్డీతో ఇంతవరకు 23వేల కోట్ల రూపాయిలను అందించడం జరిగిందన్నారు. అంతేగాక రానున్న కాలంలో దాదాపు 24- 25 వేల కోట్ల రూపాయిలను అందించి వారిని ఆర్ధికంగా మరింత బలోపేతం చేసేందుకు సంకల్పించినట్లు తెలిపారు. సోలార్ ప్యానల్స్ , పెట్రోల్ బంక్ల ఏర్పాటు, ప్రైవేటు బస్సులకు యజమానులుగా చేసే పధకాలతో పాటు ప్రత్యేకంగా తాను చూసే ఇందిరమ్మ ఇండ్ల పధకంలో ఇండ్ల పట్టాలు మహిళల పేరిటే ఇస్తున్నామని తెలిపారు. మహిళాదినోత్సవం నాడు ఈ ఏడాది మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచనల మేరకు ఈ ప్రత్యేక అభనందన కార్యక్రమం ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా మహిళలకు, మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అక్రిడిటేషన్ కార్డుల మంజూరులో కూడా వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో ప్రజలు ప్రభుత్వాన్ని సమన్వయం చేసేలా మీ నుంచి ఉత్తమ పాత్రికేయ సేవలు కావాలని మంత్రి పొంగులేటి అభిలషించారు.