- వారికి అవకాశమిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు
- మంత్రి సీతక్కతో కలిసి.. డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి
- వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పోర్టల్ ఆవిష్కరణ
- నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్
హైదరాబాద్ : మహిళలకు అవకాశం ఇస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఒక మహిళ చదువుకుంటే ఒక తరమే ముందుకు వెళుతుందని, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజం అని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్‌లోని ఆదివాసీ భవన్‌లో ఆదివారం జరిగిన వేడుకల్లో మంత్రి సీతక్కతో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆదివాసీ భవన్‌లో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, ఫీడింగ్ కియోస్క్ స్టాళ్లను మంత్రులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అక్కడున్న మహిళలు, బాలికలతో ఆత్మీయంగా ముచ్చటించి వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆడిటోరియంలో మహిళల ఆరోగ్య పరీక్షలు, క్యాన్సర్ టీకాలపై రూపొందించిన షార్ట్ వీడియోస్‌ను ప్రదర్శించారు. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాల్లో ఉండే మహిళల భద్రత, వసతి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్‌ను, సెర్ప్ (SERP) గతేడాది సాధించిన విజయాలకు సంబంధించిన బుక్‌లెట్‌ను మంత్రులు ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాల సభ్యులను మంత్రులు సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. మహిళలు ఎదగడానికి ఆకాశమే హద్దని, అవకాశం ఇస్తే వారు అసాధ్యాన్ని కూడా సాధిస్తారని కొనియాడారు. మహిళా సాధికారత కేవలం సంక్షేమ నినాదం కాదని, అది దేశ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా శక్తికి గుర్తింపుగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వంటి పథకాలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం.. మహిళా సంఘాలకు రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేయడంతో పాటు, సుమారు రూ.1,200 కోట్ల వడ్డీ రాయితీని అందించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
మహిళలు ఆర్థికంగానే కాదు, ఆరోగ్యంగానూ బలంగా ఉండాలనే ఉద్దేశంతో వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళల కోసం ఉచిత హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఉన్న 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 46 లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు (Health Profiling) నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. సెర్ప్ (SERP) సహకారంతో మహిళలను సమీప పీహెచ్‌సీలకు తీసుకెళ్లి బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి 30 రకాల కీలక పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నామన్నారు. ఆరోగ్య పరీక్షల అనంతరం ప్రతి మహిళకు క్యూఆర్ (QR) కోడ్‌తో కూడిన డిజిటల్ హెల్త్ రికార్డును సృష్టించి, e-HMIS పోర్టల్‌లో భద్రపరుస్తారని మంత్రి వెల్లడించారు. దీనివల్ల భవిష్యత్తులో వారి ఆరోగ్య సమస్యలను సులభంగా గుర్తించి చికిత్స అందించవచ్చని మంత్రి వివరించారు.
మన దేశంలో మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత అత్యధికంగా వేధిస్తున్న సర్వైకల్ (గర్భాశయ ముఖ ద్వార) క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఏటా సుమారు 3,200 సర్వికల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, దీని నివారణకు హెచ్‌పీవీ (HPV) టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. 14 ఏళ్లు నిండిన సుమారు 4లక్షల మంది బాలికలకు ఈ టీకా వేయనున్నారు. బయట మార్కెట్లో రూ.3 వేల నుంచి రూ.4 వేల విలువ చేసే గార్డాసిల్-4 (GARDASIL-4) టీకాను ప్రభుత్వ ఆసుపత్రుల్లో (PHC, CHC, జిల్లా ఆసుపత్రులు) కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆరోగ్యంగా, ఆర్థికంగా ఉన్నప్పుడే కుటుంబం, సమాజం బాగుంటాయని, ఆ దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి హామి ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.