ఢిల్లీ సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల అల్లర్లు.. 20కి చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతుంది. ఈ నెల 23 నుంచి తూర్పు, ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్ల ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. సుమారు 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను, హింసను అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఘర్షణలను అదుపు చేసే బాధ్యతను జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌కు కేంద్రం అప్పగించినట్లు సమాచారం. ఈ క్రమంలో నిన్న రాత్రి జాఫ్రాబాద్‌, సీలాంపూర్‌ సహా ఈశాన్య ఢిల్లీలో అజిత్‌ దోవల్‌ పర్యటించారు. వివిధ వర్గాల ప్రతినిధులతో అజిత్‌ దోవల్‌ చర్చలు జరిపారు. ఇవాళ జాతీయ భద్రత వ్యవహారాల మంత్రివర్గ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీకి అజిత్‌ దోవల్‌ హాజరై ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులను వివరించే అవకాశం ఉంది. ఢిల్లీ అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గత రెండు రోజుల్లో మూడుసార్లు సమీక్ష జరిపారు.