హైదరాబాద్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల 12వ తేదీన సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, మేయర్లకు నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు , 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు ఆదేశించారు. జూన్ 12వ తేదీ వరకు నిర్వహించే 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 12న కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నిర్వహించే శిక్షణా కార్యక్రమంపై నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కార్యదర్శి టి.కె శ్రీదేవి, సెర్ప్ సీఈఓ దివ్య, ప్రణాళికా శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేస్తేనే ఉత్తమ ఫలితాలు వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే ఉటంకిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు ఏవిధంగా నైతే ప్రామాణికమైన ఫలితాలు అందుతాయో, ఆ కోణంలో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్లాగ్ షిప్ కార్యక్రమాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు , ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం తదితర అంశాలపై స్పష్టమైన అవగాహన కలిగేలా ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,700 గ్రామా పంచాయతీలు, 110 మున్సిపల్ సంస్థలున్నాయని, వీటన్నింటిలో 15000 మంది ప్రజాప్రతినిధులున్నారని వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎం.పీ లు , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లను కూడా ఆహ్వానించాలని సి.ఎస్ స్పష్టం చేశారు. జిల్లా లోని వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే ఫోటో ప్రదర్శనను కూడా వేదిక వద్ద ఏర్పాటు చేయాలన్నారు. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఫైళ్ల క్లియరెన్స్, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు జిల్లా కలెక్టర్లను రామకృష్ణా రావు అభినందించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఈసందర్బంగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తమ విధులు బాధ్యతలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సర్పంచుల పాత్ర తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించాలన్నారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి టి.కె శ్రీదేవి మాట్లాడుతూ, సిటిజెన్ చార్టర్, మున్సిపల్ చట్టాలు, ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం, అమృత్ తదితర కార్యక్రమాలపై మున్సిపల్ ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. సెర్ప్ సి.ఈ.ఓ దివ్య మాట్లాడుతూ, ఈనెల 12న ఏర్పాటు చేసే శిక్షణ కార్యక్రమానికి సంబంధించి సవివరమైన ట్రైనింగ్ మాడ్యూల్ ను ఇప్పటికే కలెక్టర్లకు పంపామని తెలిపారు.