తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా బుధవారం లోక్‌భవన్‌లో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌.. శివప్రతాప్‌ శుక్లాతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌ రెడ్డి తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం శివ ప్రతాప్‌ శుక్లా మాట్లాడుతూ తెలంగాణ గవర్నర్‌గా పదవీ బాధ్యతలను వినమ్రతతో గౌరవభావంతో స్వీకరిస్తున్నానని, రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతను అప్పగించిన రాష్ట్రపతి, ప్రధానిలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అంటే గొప్ప సాంస్కృతిక సంపద, సంప్రదాయాలు, అసాధారణ పురోగతికి నిదర్శనమన్నారు. రాష్ట్రం ఆశలు, అవిష్కరణలు, సహన శక్తికి ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. హిమాచల్‌ గవర్నర్‌గా పనిచేసిన అనుభవం తెలంగాణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నానని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి, ఆయన క్యాబినెట్‌ సహచరులతో కలిసి తెలంగాణను రాజ్యాంగ లక్ష్యాలకు అనుగణంగా అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు.