మూసీ ప్రక్షాళనపై క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబుతో ఏర్పాటు చేయనున్న ఈ కమిటీకి.. ప్రతిపక్షాలు సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని సూచించారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, దీనిపై వారికి ఉన్న అభ్యంతరాలేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం శాసనమండలిలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మూసీ రివర్ డెవలమెంట్ కార్పొరేషన్‌ను ప్రారంభించింది తామేనని చెప్పుకొనే బీఆర్ఎస్.. ఇప్పుడు ఆపాలని ఎందుకు ప్రయత్నిస్తోందని నిలదీశారు. ‘‘మీరు ప్రారంభించి వదిలేస్తే.. మేం ముందుకు తీసుకెళుతున్నాం. ఆపాలని కాకుండా ముందుకు తీసుకెళ్లడానికి సలహాలు ఇవ్వాలి. 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిని నిర్ణయించింది కూడా మీరే. దీనిపై అభ్యంతరాలు తెలపాలని సమావేశానికి ఆహ్వానిస్తే.. రాలేదు. ఆన్లైన్లో వివరాలు చూసి అయినా సలహాలిస్తారనుకుంటే.. అదీ చేయలేదు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తనకు సూచనలు ఇవ్వడం వారికి ఇబ్బంది అనుకుంటే.. క్యాబినెట్ సబ్ కమిటీ ఇవ్వవచ్చన్నారు. కలుషిత మూసీ జలాల వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులు ఎదుర్కొనే సమస్యలను కళ్లారా చూసిన వారెవరైనా ఈ ప్రాజెక్టుకు అడ్డు చెప్పరని వ్యాఖ్యానించారు. ఇకనైనా ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు రావాలని, రాజకీయ ప్రయోజనాలు పక్కనపెట్టాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వారెవరినీ నిరాశ్రయులను చేయబోమని, మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని తెలిపారు. ఎవరూ రాజకీయ పార్టీల ఉచ్చులో పడొద్దన్నారు. రాజకీయ పార్టీలు కూడా ప్రజల్లో అపోహలు సృష్టించవద్దని, అభివృద్ధికి అడ్డుపడవద్దని కోరారు.