లంచం ఇస్తేనే ఫైల్స్ కదులుతాయి.. హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్‌ ఇండ్లల్లో సోదాల్లో భారీగా ఆస్తుల బహిర్గతం

రిజిస్ట్రేషన్ల శాఖలో అంతులేని అవినీతి జరుగుతున్నది. నిర్దేశిత ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ పూర్తయినా డిమాండ్‌ చేసినంత లంచం ఇవ్వాల్సిందే. లేదంటే దరఖాస్తుదారులకు రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. లంచం ఇవ్వని దరఖాస్తుదారులకు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు ఇవ్వడంలేదు. రిజిస్ట్రేషన్‌ పూర్తయినా డాక్యుమెంట్లను నెలలతరబడి తమ వద్దే ఉంచుకొని వేధింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లోనూ ఇదే దందా జరుగుతున్నది. వందల మంది ఫిర్యాదులతో తప్పనిసరి పరిస్థితుల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం హనుమకొండలోని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అవినీతి వ్యవహారం బయటపడింది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన 204 డాక్యుమెంట్లను సబ్‌ రిజిస్ట్రార్లు తమ వద్దనే పెట్టుకున్నారు. వీటిలో నాలుగు నెలల క్రితం రిజిస్ట్రేషన్‌ పూర్తయిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. చెప్పినంత మొత్తం ముట్టజెప్పే వరకు డాక్యుమెంట్లు ఇచ్చేది లేదని దరఖాస్తుదారులకు తేల్చి చెప్పారు. నేరుగా కలువకుండా ప్రైవేటు డాక్యుమెంటు రైటర్లతో దరఖాస్తుదారులకు సమాచారం ఇచ్చి లంచం డబ్బులు ఇవ్వాల్సిందేనని వేధింపులకు గురిచేస్తున్నట్టు సమాచారం.

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో లంచాల ప్రక్రియ వ్యవస్థీకృతంగా జరుగుతున్నది. ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్లతో వచ్చిన దరఖాస్తుదారుల పనులు మాత్రమే పూర్తవుతున్నాయి. భూములు, ఆస్తులు, ఇతర వ్యవహారాలపై రిజిస్ట్రేషన్‌ కోసం నేరుగా వచ్చే వారి పత్రాలు సరిగా లేవని సబ్‌ రిజిస్ట్రార్లు తిరస్కరిస్తున్నారు. హనుమకొండ రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో ఇద్దరు సబ్‌ రిజిస్ట్రార్లు ఉంటారు. వీరి పరిధిలో 60 మంది ప్రైవేటు వ్యక్తులు వ్యవహారాలు నడిపిస్తున్నారు. డాక్యుమెంట్‌ తయారీ, ఆన్‌లైన్‌ దరఖాస్తు, స్లాట్‌ బుకింగ్‌, రెండు పార్టీలు రావాల్సిన సమయం అంతా వీరే నిర్ణయిస్తారు. ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్లను పత్రాలపై పెన్సిల్‌తో కోడ్‌ రాస్తారు. లంచం డబ్బులు ముట్టినట్టు గుర్తులు ఉంటాయి. కోడ్‌ ప్రకారం ఉన్న వాటినే సబ్‌ రిజిస్ట్రార్లు పూర్తి చేస్తున్నారు. ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్లకు, సబ్‌ రిజిస్ట్రార్లకు మధ్య ఫోన్‌ చాటింగ్‌లోనే అన్ని వ్యవహారాలు ఉంటాయి. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారి నుంచి తీసుకున్న లంచం డబ్బులను ఏ రోజుకారోజు ప్రైవేటు డాక్యుమెంట్‌ రైటర్లు సబ్‌ రిజిస్ట్రార్లు చెప్పిన చోట ఇస్తుంటారు. ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారమే అయినా ఏసీబీ అధికారుల తనిఖీలో మరోసారి వెల్లడైంది.

ఏసీబీ అధికారుల తనిఖీ సమయంలో 20 మంది ప్రైవేటు డాక్యుమెంట్లు రైటర్లు హనుమకొండ సబ్‌ రిజిస్ట్రారు ఆఫీసులోనే ఉన్నారు. ఏసీబీ అధికారులు వీరి వివరాల సేకరించి.. వీరికి, సబ్‌ రిజిస్ట్రార్లకు మధ్య జరిగిన లావాదేవీలను గుర్తించారు. ఇద్దరు సబ్‌ రిజిస్టార్ల మధ్య సైతం రూ.42 లక్షలు ఫోన్‌పేలో ఇచ్చి పుచ్చుకోవడం వెలుగుచూసింది.

సబ్‌ రిజిస్ట్రార్లు పని పూర్తి చేసిన డాక్యుమెంట్ల డబ్బులను ప్రైవేటు వ్యక్తులు ప్రతి శుక్రవారం ముట్టజెపుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు. హనుమకొండ ఆఫీసులోని సబ్‌ రిజిస్ట్రార్లు జమలాపురం రామనర్సింహరావు, దావులూరి ఆనంద్‌ ఇండ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. లెక్కల్లో చూపించని భారీ నగదుతోపాటు భూములకు సంబంధించిన 70 డాక్యుమెంట్లను గుర్తించారు. డెలివరీ చేయని రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లు 204 ఉన్నట్టు గుర్తించారు. నివాసాల్లో తనిఖీ చేయగా రూ.24.61 లక్షల నగదు, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.600 కిలోల వెండి ఆభరణాలు వెలుగుచూశాయి. దావులూరి ఆనంద్‌ పేరుతో కపిల్‌ చిట్‌ఫండ్స్‌లో రూ.30.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నట్టు నిర్ధారించారు. తనిఖీల్లో మరికొన్ని అక్రమ ఆస్తుల వివరాలు లభ్యమయ్యాయని, సమగ్ర వివరాలను వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.