- చరిత్రాత్మక చట్టానికి రేపటితో ఏడాది పూర్తి
- ఏడాదిలో 5కోట్లకు పైగా భూభారతి పోర్టల్ సందర్శన
- 70 లక్షల మంది పోర్టల్ ద్వారా లాగిన్
- 3.80 లక్షల మందికి పాస్‌బుక్‌లు జారీ
- పాతసర్వే పద్దతులకు స్వస్తి- రోవర్లతో సర్వే
- ప్రతి సర్వే నెంబర్‌కు భూధార్
హైదరాబాద్ :- ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పునర్నిర్మిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూహక్కుల పరిరక్షణ, పారదర్శకత, అవినీతి రహిత సేవలు సామాన్యుడికి సులభంగా అందేలా గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం తెలంగాణ చరిత్రలో కీలక సంస్కరణగా నిలుస్తోందన్నారు. ఈనెల 14వ తేదీతో భూభారతి చట్టం అమలులోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సోమవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి గారు అధికారులతో భూభారతి చట్టంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక చట్టానికి ఏడాది పూర్తైన సందర్భం మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్రంలో భూహక్కుల రక్షణకు ప్రారంభమైన కొత్త శకానికి నాందిపలికిన రోజని వ్యాఖ్యానించారు. భూభారతి చట్టానికి ముందు ఆ తర్వాత ఉన్న పరిస్ధితులపై అధికారులతో చర్చించారు. ఈ చట్టం తీసుకువచ్చే నాటికి ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొన్న పరిస్ధితులను ఈ సందర్భంగా మంత్రిగారు గుర్తు చేశారు. “నాటి పరిస్ధితిని పూర్తిగా మార్చాలన్న సంకల్పంతో పారదర్శకత, బాధ్యతాయుత, వేగం అనే మూడు ప్రధాన సూత్రాలతో రెవెన్యూ వ్యవస్ధను ప్రజలకు చేరువచేస్తున్నాం. ఈ క్రమంలోనే చారిత్రాత్మకమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చాం. ఈ చట్టం రాష్ట్రంలోని భూ పరిపాలనను పారదర్శకంగా సులభంగా మార్చింది.
బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సరైన విధివిధానాలు లేకుండా తీసుకొచ్చిన 2020 ఆర్వోఆర్ చట్టం, ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది ప్రజలు తమ భూముల హక్కుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూమి తమదే అయినప్పటికీ హక్కులను నిరూపించుకునేందుకు అధికారుల, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది.
ఆనాటి పరిస్ధితులను చూసి అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలుపుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకొని గత ఏడాది ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి చేతుల మీదుగా భూభారతి పోర్టల్‌ను ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ రైతాంగానికి భూ భద్రత కల్పించడంలో భూభారతి ఒక బలమైన ఆయుధంగా మారింది. భూ వివాదాలకు చరమగీతం పాడుతూ, సామాన్యుడికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు తగ్గించడంలో ఈ ఏడాది కాలం ఒక గొప్ప ముందడుగుగా నిలిచింది. ఈ 12 నెలల కాలంలో భూభారతి పోర్టల్ పాత చిక్కుముడులను విప్పడంలో కీలక పాత్ర పోషించింది. ఈ పోర్టల్ ప్రారంభించిన ఏడాదిలోపే 5.20 కోట్లకు పైగా ప్రజలు ఈ పోర్టల్‌ను సందర్శించారు. సుమారు 67 లక్షల మంది పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యారు. ప్రజల కోసం రెవెన్యూ శాఖ లో గణనీయమైన మార్పులు తెస్తున్నాం. రైతులకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం సంస్థ ఎన్.ఐ.సి.తో కలిసి రూపొందించిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను ఈనెల 2వ తేదీ నుంచి ఐదు జిల్లాల్లోని ఐదు మండలాల్లో్ ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఎదురయ్యే మంచి చెడులను పరిగణనలోకి తీసుకొని అవసరమైన మార్పులు చేర్పులు చేసి వచ్చే నెలలో జిల్లాకు ఒక మండలంలో ప్రారంభిస్తాం.ఈ ఐదు మండలాల్లో కూడా ప్రతి సర్వే నెంబరుకు భూధార్ నెంబర్‌ను కేటాయిస్తాం. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది.
రాష్ట్రంలో నిజాం కాలం నుంచి 378 గ్రామాలను నక్షాలు లేవు. ఇందులో ఐదు గ్రామాలలో రీ సర్వే పూర్తి చేసి భూదార్ నెంబర్ కేటాయించాం.మిగిలిన 373 గ్రామాల్లో రోవర్స్ వంటి ఆధునిక సర్వే సాంకేతికతను ఉపయోగించి రీసర్వే పనులు కొనసాగిస్తున్నాం.
జిల్లాకు 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సర్వే చేపట్టబోతున్నాం. సర్వే అనంతరం హద్దులను గుర్తించి భూధార్ నెంబర్ ఇస్తాం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా సర్వే నిర్వహించాలని నిర్ణయించాం. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వేనెంబర్లు వినియోగంలో ఉండగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ 77 సంవత్సరాలలో 2కోట్ల 29 లక్షలకు చేరాయి. వీటన్నింటికీ భూధార్ నెంబర్ ఇవ్వడానికి ప్రణాళికలు తయారుచేస్తున్నాం. భూ సర్వేకు అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవడం జరిగింది. శిక్షణ ఇచ్చి 5,520 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు లైసెన్స్‌లు జారీ చేశాం. భూవిస్తీర్ణాన్ని బట్టి ప్రతి మండలానికి 4 నుంచి 6గురు సర్వేయర్లను నియమించాం. రాష్ట్రంలోని 10,984 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్లుగా విభజించి జీపీవోలను నియమించడం జరిగింది. గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ టేప్ వంటి పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి అత్యాధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం వీలైనంత వరకు వినియోగించుకుంటున్నాం. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేశాం. త్వరలో మరో 400 కొనుగోలు చేయబోతున్నాం. భూ భారతి పోర్టల్ ప్రారంభించిన గత ఏడాది ఏప్రిల్ 14 నుంచి ఇప్పటి వరకు 3.80 లక్షల పాస్ బుక్ లు జారీచేశాం.”అని వివరించారు