- 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం
- 8,500 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- ఇప్పటికే 5,000 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
- కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలతో సహా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తరలించేందుకు రవాణ వసతి ఏర్పాటు
రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరుతుండడంతో కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయని సాగు ఆలస్యం అయినందున మరో 13 జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదని ఆయన పేర్కొన్నారు. రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై శుక్రవారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో పౌర సరఫరాల శాఖాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, అడిషనల్ డైరెక్టర్ రోహిత్ సింగ్ డిప్యూటీ కమిషనర్ కొండల్ రావు,జెనరల్ మేనేజర్ ధాన్యం కొనుగోళ్లు,ఫైనాన్స్,మార్కెటింగ్ లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగినందున అదే స్థాయిలో ముందెన్నడూ లేని రీతిలో ఈ రబీ సీజన్ లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 8,500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇప్పటికే 5,000 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. 20 జిల్లాల్లో ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం అయ్యిందని,సాగు ఆలస్యం అయినందున మరో 13 జిల్లాలో కొనుగోలు ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదన్నారు. క్షేత్రస్థాయి నుండి వస్తున్న సమాచారం ప్రకారం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రానుందున అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు నాలుగు లక్షల 89 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ఆయన తెలిపారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిలువ ఉంచేందుకు గాను 12 లక్షల మెట్రిక్ టన్నులు నిలువ ఉంచేందుకు వీలుగా గోదాములు గుర్తించామని,మరో 20 లక్షల బాయిల్డ్ రైస్ ను నిలువ ఉంచేందుకు గాను జిల్లాల వారీగా కేటాయింపులు జరిపినట్లు ఆయన తెలిపారు.అంతే గాకుండా ధాన్యం కొనుగోలుకు గాను కొనుగోలు కేంద్రాలలో 16 కోట్ల గన్ని బ్యాగులను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తేమను త్వరితగతిన కొలిచేందుకు వీలుగా ప్యాడి క్లినర్లు,డ్రైయర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ కుడా ఆలస్యం జరగకుండా చూసేందుకు గాను సరిపడా హమాలిలను నియమించాలన్నారు. తూకం ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు దొర్ల కుండా చూసుకోవడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆయా ప్రాంతంలో ఉన్న మిల్లులకు తరలించేందుకు రవాణా ఏర్పాట్లను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా ధాన్యాం తరలి రాకుండా ఉండేలా అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద నిఘాను తీవ్రతరం చేస్తున్నామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి అయ్యో మొత్తాలను రైతులకు ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగేలా పౌర సరఫరాలశాఖా మార్కెటింగ్ శాఖలతో పాటు జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.