ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం తవ్వకాలలో భద్రతా ఏర్పాట్లపై ఎన్.జి.ఆర్.ఐ సమగ్ర సర్వే నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేత

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం తవ్వకాలలో అనుకరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సమగ్రంగా రూపొందించిన నివేదికను శుక్రవారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్.జి.ఆర్.ఐ ప్రధాన శాస్త్ర వేత్త సత్యనారాయణ అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్.జి.ఆర్.ఐ సంస్థను అభినందించడంతో పాటు ఎస్.ఎల్.బి.సి పునరుద్ధరణ పనుల పురోగతితో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పధకంలో బాగమైన మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ల బ్యారేజ్ ల పునరుద్ధరణకు గాను ఎన్.జి.ఆర్.ఐ ఆధ్వర్యంలో భూపరిశోధన( సాయిలు టెస్ట్) భాగస్వామ్యం కావాలన్నారు. శుక్రవారం రోజు డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో ఈ మేరకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇ ఎన్ సి రమేష్ బాబు సొరంగ మార్గం తవ్వకాల నిపుణుడు పరిక్షిత్ మెహ్రా,ఎన్.జి.ఆర్.ఐ శాస్త్రవేత్త సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్.జి.ఆర్.ఐ రూపొందించిన నివేదిక పై అయన మాట్లాడుతూ ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గం తవ్వకాల సమయంలో జరిగిన దురదృష్టకర సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకే తవ్వకాల సమయంలో అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలపై ఎన్.జి.ఆర్.ఐ తో సమగ్రంగా సర్వే నిర్వహినట్లు ఆయన తెలిపారు.

తవ్వకాల సమయంలో ముందస్తుగా ప్రమాదవకాశాలను గుర్తించేందుకు వీలుగా ఈ సంస్థ సీస్మిక్ ఇమేజింగ్,ఎలక్ట్రికల్ రెసిస్టివిటి టొమోగ్రఫీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు ఆయన వివరించారు. సొరంగ మార్గం తవ్వకాలలో కార్మికుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం మొదట ప్రాధాన్యతాంశంగా పెట్టుకుందన్నారు. అందుకు తగినట్లు గానే ఎన్.జి.ఆర్.ఐ శాస్త్రవేత్తల మార్గదర్శనానికి అనుగుణంగానే సొరంగ మార్గం తవ్వకాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఎన్.జి.ఆర్.ఐ రూపొందించిన నివేదిక లో స్ట్రెస్ జోన్ లు,నీటి ఊరట లతో పాటు సొరంగమార్గం పై భాగం తదితర అంశాల పై ఎన్.జి.ఆర్.ఐ శాస్త్రవేత్తలు సమగ్రంగా అధ్యయనం జరిపారని ఆయన తెలిపారు. ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ పనుల పై ఆయన మాట్లాడుతూ వేగవంతంగా కొనసాగుతున్న్నాయాన్నారు. ఎలక్ట్రిక్ లోడర్లు,భారీ డంపర్ల తోడ్పాటుతో ఇప్పటి వరకు 151.50 మీటర్ల తవ్వకం పూర్తి అయిందన్నారు. దేశీయ,అంతర్జాతీయంగా సంస్థల నుండి ఆధునిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాంగాన్ని సమీకరించి రెండు వైపులా నెలకు 200 మీటర్ల వరకు తవ్వకాలు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.