- రైతులు ఎక్కువగా ఎంచుకునే విత్తనాలు, అధిక దిగుబడి మరియు మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలనే అందుబాటులో ఉంచాలి.
- MSP భారాన్ని రాష్ట్రాలపై మోపొద్దు – కేంద్రంపై మంత్రి తుమ్మల విమర్శలు
- MSP ప్రకటించిన పంటలన్నింటిని కేంద్రమే కొనాలని మంత్రి డిమాండ్
కేంద్ర ప్రభుత్వం MSP ప్రకటించి, పంటలను కొనే బాధ్యతను మాత్రం రాష్ట్రాలపై వేస్తుందని మంత్రి తుమ్మల అన్నారు. దీంతో రాష్ట్రంపై అధిక భారం పడుతుందని తెలిపారు. MSP ప్రకటించిన ప్రతి పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఈ రోజు సచివాలయంలో వ్యవసాయశాఖ కమిషన్ చైర్మన్ కొదండ రెడ్డి మరియు కమిషన్ సభ్యులతో సమావేశమైన మంత్రి తుమ్మల, వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం అందుబాటులో ఉంచాల్సిన వరి రకాల ఎంపిక, విత్తన లభ్యత, సాగు ప్రణాళికలపై వ్యవసాయశాఖ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయశాఖ అధికారులు వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం BPT -5024, RNR-15048, HMT SONA, Jai Shreeram, KNM-1638, WGL-44, WGL 962,JGL 1798 మరియు మరికొన్ని సన్న రకాలను సిద్ధం చేసినట్లు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గత సంవత్సరం 33 రకాల సన్న రకాలను అందుబాటులో ఉంచడం వలన రైతులు అమ్మకాల సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు, కొన్నింటికి బోనస్ కూడా రాకుండా ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఈ సంవత్సరం అలాంటి సమస్యలు రాకుండా పరిమిత రకాలు మరియు రైతులకు అధిక దిగుబడి ఇచ్చే రకాలు అందుబాటులో ఉంచడంపై దృష్టి పెట్టాలని మంత్రి స్పష్టం చేశారు. సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకొని, రాష్ట్రం మరియు కేంద్రం కొనుగోలు చేసే పరిమాణాల ఆధారంగా విత్తనాల సరఫరా ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుండి 9 వరకు జరిగే రైతు ఉత్సవాల కార్యక్రమంలో మే 4 వ తేదిన ఈ విత్తనాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మే 15 కల్లా ఎంపిక చేసిన విత్తన రకాలను రైతులకు సిద్ధంగా ఉంచాలని అధికారులకు అన్నారు. అధిక దిగుబడి మరియు మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలనే అందుబాటులో ఉంచాలని మంత్రి స్పష్టం చేశారు.
సీడ్ కార్పొరేషన్ ద్వారా ఈ విత్తనాలను సరఫరా చేయడంతో పాటు, ప్రైవేట్ కంపెనీలు కూడా ఇదే రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం విత్తన కంపెనీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని వ్యవసాయశాఖ సెక్రటరీకి సూచించారు. వచ్చే మంగళవారం జరిగే రైతు నేస్తం కార్యక్రమంలో కూడా ఇదే విషయంపై చర్చించాలని సూచించారు. ఈ రకాలతో రైతులకు మేలు జరగాలని, ప్రభుత్వం ఏఏ పంటలను కొనాలనుకుంటుందో రైతులు ముందుగానే తెలుసుకునేలా వివరాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే MSP శాస్త్రీయంగా లేదని, కేంద్రప్రభుత్వం విధానాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతు కమిషన్ చైర్మన్ కొదండరెడ్డి అన్నారు. MSP విషయంలో రైతు సంఘాల మరియు స్వామి నాథన్ కమిషన్ సిఫారసులను కేంద్రం పట్టించుకోలేదని ఆయన అన్నారు.
మంత్రిగారు మాట్లాడుతూ.. కేంద్రం కేవలం MSP ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. MSP ధర ప్రకటించి, ఏమి పట్టనట్టు ఉంటుందని, రైతులకు ఆ ధర అందుతుందో, లేదో చూడట్లేదని అన్నారు. బహిరంగ మార్కెట్లో కూడా MSP ధర అందే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, దీంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలలో రైతులు మద్ధతు ధర రాకుండా నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో రైతుల వద్ద నుండి మద్ధతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, దీంతో ప్రభుత్వం అదనపు భారం పడుతోందని అన్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వంపై 2000 నుండి 3000 కోట్లు అదనంగా భారం పడుతుందని, అయినప్పటికి కేంద్రం నుండి ఎలాంటి సహాకారాలు అందడం లేదని అన్నారు. MSP ప్రకటించే ప్రతి పంటను పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా మంత్రి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయ అగ్రికల్చర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయశా ఖ అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.