తెలంగాణను మేటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

  • హైద‌రాబాద్ లో భారీ స్థాయిలో కార్నివ‌ల్ నిర్వ‌హ‌ణ‌
  • ప‌ర్యాట‌క కేంద్రాల్లో వీకెండ్ లో సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు
  • ప‌ర్యాట‌క ప్రాజెక్ట్ ల అభివృద్ధికి నిర్దిష్ట కాలపరిమితితో కార్యాచరణ రూపొందించండి
  • అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం
  • మంత్రి జూప‌ల్లి అధ్య‌క్ష‌త‌న ప‌ర్యాట‌క స‌ల‌హా క‌మిటీ స‌మావేశం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని పర్యాటక, సాంస్కృతిక‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. మౌలిక వసతుల కల్పన, గమ్యస్థానాల బ్రాండింగ్, విస్తృత ప్రచార కార్యక్రమాలకు సంబంధించి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు దిశానిర్ధేశం చేశారు. మంగ‌ళ‌వారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిర్వహించిన పర్యాటక సలహా కమిటీ/ మండ‌లి (Tourism Advisory Committee) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని వారసత్వ సంపద, సంస్కృతి, అద్భుతమైన కట్టడాలు, ప్ర‌కృతి ర‌మ‌ణీయ ప్ర‌దేశాలు, జ‌ల వ‌న‌రులు,, ద‌ట్ట‌మైన అడ‌వులు, ఆధ్యాత్మిక కేంద్రాలను సమన్వయం చేస్తూ తెలంగాణను ఒక శక్తివంతమైన పర్యాటక హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు కనీస సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని మంత్రి అధికారులకు సూచించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాత్కాలిక వసతి గదులు, టెంట్లు, గ్లాస్ హౌస్‌లతో పాటు రహదారి పక్కన ఉండే విశ్రాంతి సౌకర్యాలను వెంటనే మెరుగుప‌ర్చాల‌ని, కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు.

సలహా కమిటీ సమావేశంలో వెల్లడైన ప్రతిపాదనలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని, అమలు ప్రక్రియలో జాప్యం జరగకుండా ఒక నిర్దిష్ట పని లేదా ప్రాజెక్ట్ బాధ్యతను పర్యవేక్షించడానికి నోడల్ అధికారి (Point Person)కి అప్ప‌గించాల‌ని సూచించారు. దేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నవంబరు లేదా డిసెంబరు మాసాల్లో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో కార్నివాల్‌ నిర్వహణ‌కు అధ్య‌య‌నం చేయాలని, సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌త్రిపాద‌న‌లు రూపొందించి, స‌మ‌ర్పించాల‌ని చెప్పారు. ప్రారంభంలో ప్రభుత్వమే దీనిని చేపట్టినా, భవిష్యత్తులో ప్రైవేటు భాగస్వామ్యంతో స్వయం సమృద్ధిగా సాగేలా చూడాలని తెలిపారు. జీహెహెచ్ఎంసీ, హెచ్ఏండీఏ స‌మ‌న్వ‌యంతో నగర సుందరీకరణలో భాగంగా శిల్పాలు, ఆకర్షణీయమైన ల్యాండ్‌స్కేపింగ్‌, స్కై వాక్ లు సృజనాత్మక ఉట్టిప‌డేలా తీర్చిదిద్దాల‌ని ఉద్భోదించారు.

రాష్ట్రంలోని సోమశిల, వరంగల్, రామప్ప, యాదాద్రి, గోల్కొండ, తారామతి బరాదరి, నాగార్జున సాగర్ వంటి కీలక పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాల‌ని మంత్రి ఆదేశించారు. పర్యాటకులను ఆక‌ట్టుకునేలా ప్రధాన ప‌ర్యాట‌క కేంద్రాల్లో క్రమం తప్పకుండా వారాంతపు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్పెష‌ల్ సీఎస్ వాణి ప్ర‌సాద్ మాట్లాడుతూ… మ‌న రాష్ట్రంలో అద్బుత‌మైన ప‌ర్యాట‌క ప్ర‌దేశాలు, వ‌న‌రులు ఉన్నప్ప‌టికీ, ప్ర‌చారంలో వెనుక‌బ‌డి ఉన్నామని, దీనిపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, కెరావెన్ (Caravan) కోసం ఇప్పటికే ప్రతిపాదనలు ఆహ్వానించామ‌ని (EOI) చెప్పారు. పెండింగ్ లో ఉన్న హ‌రిత హోట‌ళ్ల నిర్మాణం పూర్తికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వారసత్వ కట్టడాల నిర్వహణ కోసం ‘ఆగాఖాన్’ మోడల్‌లో ట్రస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు.

తెలంగాణ‌ను అంతర్జాతీయ స్థాయిలో వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడంతో పాటు మెడికల్, వెల్నెస్, గోల్ఫ్, ఫిలిం, ఎకో టూరిజం కేంద్రంగా ప్రచారం చేయాలని కమిటీ సభ్యులు ఈ సమావేశంలో ప్రతిపాదించారు. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, సెంట్రల్ ఆసియా మార్కెట్లలో విస్తృత మార్కెటింగ్ కార్యక్రమాలు చేపట్టాలని కమిటీ సభ్యులు నొక్కి చెప్పారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేలా ఇన్వెస్టర్ అవుట్ రీచ్ కార్యక్రమాలు చేపట్టాలని, ప్రాజెక్టుల అమలులో వేగం పెంచాలని సూచించారు. తెలంగాణ‌లో ఉన్న ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను అద్బుత కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చైనా, వియ‌త్నాం వంటి దేశాల్లో అధ్యయన పర్యటనలు చేపట్టాలని, జైపూర్ సిటీతో పోటీ ప‌డేలా హైద‌రాబాద్ తో పాటు ఇత‌ర ప్రాంతాలను ‘వెడ్డింగ్ డెస్టినేషన్స‌గా తీర్చిదిద్ద‌డం,కేరళ తరహాలో ప్రకృతి ఉత్పత్తులు, సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందించ‌డం, ఈత‌, తాటి క‌ల్లు, ఇత‌ర ఉప ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హిస్తూనే బ్రాండింగ్ చేయ‌డం, వారసత్వ విధానం (Heritage policy) ఉండాలని, విదేశీయుల కంటే భారతీయులే పర్యాటకానికి ఎక్కువ ఖర్చు చేస్తారు, కాబట్టి స్వదేశీ పర్యాటకంపై దృష్టి పెట్టి తెలంగాణ ప‌ర్యాట‌క ప్ర‌మోష‌న్, బ్రాండింగ్ పై ప్ర‌త్యేక దృష్టి సారించి, ప్ర‌చారానికి నిధులు కేటాయించాలి, మధ్యప్రాచ్యం (Middle East) నుండి పర్యాటకులను ఆక‌ర్శించ‌డం వంటి అంశాల‌పై దృష్టి పెట్టాల‌ని ప్ర‌తిపాదించారు. వరంగల్, సోమశిల వంటి ప్రాంతాల్లో ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 నుండి 5 స్టార్ హోటళ్లను నిర్మించ‌డం, బమ్మెరలో పోతన స్మృతి వనం నిర్మాణ పనుల్లో వేగం పెంచాల‌ని, వ‌రంగ‌ల్ హ‌రిత హోట‌ల్ నుంచి రామ‌ప్ప వ‌ర‌కు బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డ‌పాల‌ని క‌మిటీ స‌భ్యులు సూచించారు. ఈ సమావేశంలో ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్ట‌ర్ గౌత‌మి, డైరెక్ట‌ర్ ఆఫ్ టూరింజం – ల‌క్ష్మ‌ణ్ రంజిత్ నాయ‌క్, కమిటీ సభ్యులు పాపారావు (IAS), కమలవర్ధన్ రావు (IAS), డాక్టర్ బాలాజీ, జుల్ఫీ, మార్గ్ పటేల్, రాందేవ్ రావు, తదితరులు పాల్గొన్నారు.