తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా 1991 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. యూపీఎస్సీ ఎంప్యానెల్ నివేదిక ప్రకారం సీవీ ఆనంద్‌ను పూర్తి స్థాయి డీజీపీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరిస్తారు. వాస్తవానికి శివధర్ రెడ్డిని డీజీపీగా నియమించడం యూపీఎస్సీ నియామక ప్రక్రియకు వ్యతిరేకంగా జరిగిందని కొందరు సుప్రీంకోర్టులో కేసు వేయడంతో యూపీఎస్సీ నియమాల ప్రకారం జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్ర భుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్‌ల పేర్లతో కూడిన జాబితాను పంపించగా.. సీవీ ఆనంద్, వినాయక్ప్రభాకర్ ఆప్టే, సౌమ్యామిశ్రాల పేర్లను షార్ట్ లిస్టు చేసి యూపీఎ్‌ససీ ప్రభుత్వానికి తిరిగి పంపింది. వీరిలో ఆనంద్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించనున్నట్లు తొలుత ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించిన విషయం తెలిసిందే.