హైదరాబాద్ : సరస్వతీ అంత్య పుష్కరాలాను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం సచివాలయంలోని దేవాదాయ శాఖ మంత్రి ఛాంబర్ లో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలసి సరస్వతి అంత్య పుష్కరాలు పోస్టర్, అధికారిక టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఈ సరస్వతీ అంత్య పుష్కరాలను మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నట్లు అన్నారు. పుష్కరాలకు 30.63 కోట్లతో 162 అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు పుష్కర స్నానం, స్వామి దర్శనం చేసుకొనే విధంగా ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల సమన్వయంతో పని చేయాసని అధికారులను కోరారు. ఈ అంత్య పుష్కరాలకు 30 లక్షల భక్తులు ఈ పుష్కరాలకు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరస్వతి ఆది పుష్కరాలు (మే 15, 2025 నుండి మే 26, 2025), సమ్మక సారలమ్మ జాతర నిర్వహణకు అవకాశం వచ్చిందని, వీటిని అత్యంత ఘనంగా నిర్వహించామని అన్నారు. ఇప్పుడు సరస్వతి అంత్య పుష్కరాలు, వచ్చే సంవత్సరం రానున్న గోదావరి పుష్కరాలకు కూడా పనులను కూడా ప్రారంభించామని తెలిపారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సరస్వతీ పుష్కరాలను భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అన్నారు. 10 రోజుల ముందే పుష్కరాల పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య కలగకుండా పోలీసు యంత్రాంగం, ఇతర శాఖల సమన్వయంతో పని చేయాలని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి పుష్కరాలను విజయవంతం చేయాలని కోరారు. కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణానికి రూ. 198 కోట్లను కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ, ఈ పుష్కరాలను మే 21 నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు కాళేశ్వరంలో నిర్వహిస్తున్నట్లు అన్నారు. పుష్కరాల మొదటి రోజు ఉదయం 5 గంటల 43 నిమిషాలకు ప్రారంభ పుష్కర స్నానాన్ని కంచికామకోటి పీఠాధిపతి శంకర విజేంద్ర సరస్వతీ స్వామి చేస్తారని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించామని తెలిపారు. ప్రతి రోజు ఒక పీఠాధిపతి ఉదయం పుష్కర స్నానం చేసే విధంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ప్రతి రోజు త్రివేణి సంగమం వద్ద సాయంత్రం 6.30 ఘనంగా కాశి పండిట్ లు హారతి నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, కాళేశ్వర ఆలయ ట్రస్ట్ చైర్మన్ మోహన్ శర్మ, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.