రికార్డు స్థాయిలో ఏసీబీ కేసులు: డైరెక్టర్ జనరల్ చారు సిన్హా

  • గత పదేళ్ల రికార్డులను తిరగరాసిన ఏసీబీ అధికారులు
  • 2026లో మొదటి త్రైమాసికంలోనే అత్యధిక కేసులు నమోదు

తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అంతమే లక్ష్యంగా పనిచేస్తున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పదేళ్ల రికార్డులను తిరగరాస్తూ, 2026లో మొదటి త్రైమాసికంలోనే అత్యధిక సంఖ్యలో కేసులను నమోదు చేసింది. జనవరి నుంచి మార్చి వరకు జరిగిన ఈ దాడులు, దర్యాప్తు తీరుపై ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు సిన్హా బుధవారం హైదరాబాద్ లో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసిన అధికారులకు పురస్కారాలను అందజేశారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో, వృత్తిపరమైన నైపుణ్యంతో వ్యవహరించడం వల్లే ఈ రికార్డు స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా, పక్కా ఆధారాలతో దర్యాప్తును వేగవంతం చేయడంలో ఏసీబీ అధికారులు ప్రదర్శించిన అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు. అవినీతిని అరికట్టడంలో రాజీలేని పోరాటం సాగిస్తున్న అధికారుల కృషిని గుర్తించి, వారిని గౌరవించడంతో శాఖలో నూతనోత్సాహం నెలకొంటుందని ఆకాంక్షించారు. అవినీతి అనేది ఒక దేశాన్ని లోలోపల డొల్లగా మారుస్తుందని, సమాజ పురోగతికి ఇది పెద్ద అవరోధమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శక తను పెంపొందించడం ద్వారానే ప్రజల నమ్మకాన్ని చూరగొనగలమని, అందుకు ప్రతి అధికారి అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటించాలని పిలుపునిచ్చారు. ప్రజా సేవలో చిత్తశుద్ధితో ఉంటూ, ఎక్కడా అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందించడమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. త్రైమాసిక సమీక్షలో వెల్లడైన పురోగతిని ఇదే వేగంతో ముందుకు తీసుకెళ్లా లని, ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ నిరంతరం నిఘా కొనసాగించాలని ఆదేశించారు. వివిధ విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.