కంపా నిధుల వినియోగంలో గత కొన్నేళ్లుగా అగ్రగామిగా నిలుస్తున్న తెలంగాణ అటవీ శాఖ వచ్చే యేడాది కోసం ప్రతిపాదనలను సిద్దం చేసింది. అరణ్య భవన్ లో జరిగిన కంపా ఎగ్జిక్యూటివ్ కమిటీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి 603 కోట్ల పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. పీసీసీఎఫ్ ఆర్.శోభ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్థిక శాఖ, గ్రామీణాభివృద్ది, వ్యవసాయ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు హాజరయ్యారు. 2014 -19 మధ్య రాష్ట్రానికి 645 కోట్ల నిధులను కేంద్రం కేటాయించగా , సుమారు 99 శాతానికి పైగా నిధులు సద్వినియోగం అయ్యాయని సమావేశంలో అదనపు పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్ వివరించారు. కంపా నిధులతో తెలంగాణ అటవీ శాఖ చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీకరణ, అడవుల పునరుద్దరణ, ఇతర పనులకు కేంద్రం నుంచి ప్రశంసలు దక్కాయని అన్నారు. అలాగే జరిగిన పనులన్నింటినీ పక్కాగా ఆడిట్ చేసి, రిపోర్టులు అందించటంలో కూడా తెలంగాణ ముందు వరసలో ఉందన్నారు. అటవీ భూముల స్థీరీకరణ, పునరుజ్జీవన చర్యల కోసం క్షేత్ర స్థాయి నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది కోసం 603 కోట్ల ప్రతిపాదనలు అందాయని, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదంతో, వాటిని కేంద్రానికి పంపుతామని జైస్వాల్ వెల్లడించారు. సుమారు ఐదు వందల కోట్ల అంచనాలతో ప్రస్తుత ఏడాది జరుగుతున్న పనుల పురోగతిని కూడా కమిటీ చర్చించి, సంతృప్తి వ్యక్తం చేసింది. సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీదేవి, అదనపు పీసీసీఎఫ్ లు ఆర్.ఎం. డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సి. పర్గెయిన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.