దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ‌లో అక్రిడిటేష‌న్ల జారీ: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

  • అక్రిడిటేష‌న్ల సంఖ్య తేలితే జ‌ర్న‌లిస్ట్‌ల‌కు మ‌రిన్ని సౌక‌ర్యాల క‌ల్ప‌న‌
  • గ‌తం కంటే ఇప్పుడు రెట్టింపు సంఖ్య‌లో అక్రిడిటేష‌న్ల మంజూరు
  • మే10లోగా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారంద‌రికీ అక్రిడిటేష‌న్లు
  • మే1 అన్ని జిల్లాల్లో అక్రిడిటేష‌న్ల పంపిణీకి క‌లెక్ల‌ర్ల‌కు ఆదేశం
  • మే 15వ‌ర‌కు అంద‌రికీ బ‌స్సు పాస్‌ల పొడిగింపు
  • రాష్ట్ర స‌మాచార‌, పౌర‌సంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి జ‌ర్న‌లిస్ట్‌కు అక్రిడిటేష‌న్లు మంజూరు చేసేందుకు ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉంద‌ని రాష్ట్ర స‌మాచార‌, పౌర‌సంబంధాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న మేర‌కు పాత్రికేయుల‌కు ఆరోగ్యంతోపాటు మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంద‌ని అన్నారు. గురువారం నాడు స‌మాచార శాఖ ఆధ్వ‌ర్యాన జ‌ర్న‌లిస్టుల‌కు కొత్త అక్రిడిటేషన్ కార్డుల‌ను మంత్రి అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన అక్రిడిటేష‌న్ కార్డుల‌ను ఇంత‌వ‌ర‌కు పొడిగించామ‌ని, దేశంలో, ఇతర రాష్ట్రాల‌లో అమ‌లు చేస్తున్న ఉత్త‌మ విధానాల‌ను ఇక్క‌డ అనుస‌రించాల‌న్న ఆలోచ‌న మేర‌కు ప‌రిశీల‌న సాగింద‌ని అందువ‌ల్లే ఈ కార్డుల జారీలో ఆల‌స్యం చోటుచేసుకుంద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం 32,500 మందికి అక్రిడిటేష‌న్లు ఇచ్చే అవ‌కాశం ఉన్నా 23,352 కే ప‌రిమితం చేసింద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం ఇప్పుడు సుమారు 46 వేల మందికి పైగా అక్రిడిటేష‌న్లు ఇచ్చేలా మార్పులు చేసింద‌ని తెలిపారు. ఇప్ప‌టికే సుమారు 2800 వ‌ర‌కు కార్డుల‌ను ఆమోదించ‌డం జ‌రిగింద‌ని వివ‌రించారు. జ‌ర్న‌లిస్టుల సూచ‌న‌ల మేరకు జీవోల‌లో మార్పులు చేర్పులు చేశామ‌ని, అర్హులైన జ‌ర్న‌లిస్టుల‌కు కార్డుల మంజూరులో వెన‌క‌డుగు ప్ర‌స‌క్తే లేద‌ని అన్నారు. మే 1వ తేదీన అన్ని జిల్లాల్లో అక్రిడిటేష‌న్ కార్డుల పంపిణీ చేయాలంటూ క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి ప్ర‌క‌టించారు.

ఈ ప్ర‌క్రియ‌లో మే 10 వ‌తేదీని ఒక క‌టాఫ్ డేట్‌గా పెట్టుకొని ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని, ఆ తేదీలోగా వ‌చ్చే ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదించ‌డం జ‌రుగుతుంద‌ని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అక్రిడిటేష‌న్లు సంఖ్య తేలితే జ‌ర్న‌లిస్టుల‌కు ఆరోగ్యం ఇత‌ర సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు ఒక ప్ర‌ణాళిక రూపొందించుకోవ‌చ్చున‌ని అన్నారు. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దిశ‌గా ప‌లు సూచ‌న‌లు చేశార‌ని వెల్లడించారు. అంతేగాక జ‌ర్న‌లిస్టులు వివిధ సంస్ద‌లలో ఉద్యోగాలు మారిన‌ప్ప‌టికీ అక్రిడిటేష‌న్ల మంజూరు ఓ నిరంత‌ర ప్ర‌క్రియ‌గా సాగుతుంద‌ని ఈ విష‌యంలో ఎటువంటి సందేహాలు వ‌ద్ద‌ని అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ‌లో జర్న‌లిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామ‌ని త్వ‌ర‌లో పాత్రికేయ సంఘాల‌తో భేటీ అవుతామ‌ని తెలిపారు. ఏప్రిల్ 30తో కొంత‌మంది జ‌ర్న‌లిస్టుల బ‌స్సుపాస్‌ల గడువు ముగుస్తున్నందున మ‌రో 15 రోజుల పాటు పొడిగించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి పొంగులేటి ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు పాత్రికేయుల‌కు అక్రిడిటేష‌న్ కార్డుల‌ను అంద‌జేసి అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో మీడియా అకాడ‌మీ ఛైర్మ‌న్ కె. శ్రీ‌నివాస‌రెడ్డి, స‌మాచార శాఖ స్పెషల్ క‌మీష‌న‌ర్ ముకుంద‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.