ఏరోస్పేస్ దిగ్గజాలకు వ్యూహాత్మక భాగస్వామిగా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు

  • డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ లోనూ గ్లోబల్ లీడర్ గా నిలుపుతాం
  • ఎకోసిస్టమ్, ఇన్నోవేషన్, ఆర్అండ్ డీ, ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్ పై ప్రత్యేక దృష్టి
  • ‘ఐటీపీ ఏరో – ఇండియా’ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ భూమి పూజలో మంత్రి శ్రీధర్ బాబు

అంతర్జాతీయ ఏరోస్పేస్ దిగ్గజాలకు తెలంగాణను ఒక వ్యూహాత్మక భాగస్వామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రాన్ని కేవలం విడిభాగాల తయారీకే పరిమితం చేయకుండా…. గ్లోబల్ ఏరోస్పేస్ ఆర్‌ అండ్‌ డీ హబ్‌గా మార్చేందుకు అవసరమైన ‘కాంప్రహెన్సివ్ రోడ్డు మ్యాప్’ను సిద్ధం చేస్తున్నామన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హార్డ్ వేర్ పార్క్ (ఫేజ్ – 3) లో రూ.453 కోట్ల పెట్టుబడితో 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ‘ఐటీపీ ఏరో – ఇండియా’ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కు ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. ఆనతికాలంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌లలో ఒకటిగా తెలంగాణను నిలిపామన్నారు. వరుసగా అయిదేళ్లు కేంద్రం నుంచి ‘బెస్ట్ స్టేట్ ఫర్ ఏరోస్పేస్’ అవార్డును అందుకోవడం రాష్ట్రంలోని పటిష్ఠమైన ఎకో సిస్టమ్‌కు నిదర్శనమన్నారు. బోయింగ్, జీఈ ఏవియేషన్, సాఫ్రాన్, లాక్హీడ్ మార్టిన్, టాటా వంటి గ్లోబల్ ఏరోస్పేస్ దిగ్గజాలు ఇప్పటికే మన దగ్గర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. తాజాగా… ఈ జాబితాలో స్పెయిన్ దిగ్గజ సంస్థ ‘ఐటీపీ ఏరో’ కూడా చేరడంతో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తమవుతుందన్నారు. సంప్రదాయ తయారీ రంగంతో పాటు డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ లాంటి నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీస్ లోనూ రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలిపేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. అందుకు అవసరమైన… మౌలిక సదుపాయాల కల్పన, ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఇన్నోవేషన్, ఆర్ అండ్ డీ, ఇండస్ట్రీ రెడీ వర్క్ ఫోర్స్ తయారీ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. విమాన ఇంజిన్ల తయారీలో వినియోగించే అత్యంత కీలకమైన విడిభాగాలు ఈ ‘ఐటీపీ ఏరో – ఇండియా’ నూతన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ఉత్పత్తి అవుతాయన్నారు. వచ్చే ఏడాది నాటికి ఇక్కడ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయన్నారు. ప్రిసిషన్ ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్ తదితర విభాగాల్లో ప్రాథమికంగా 350 మంది నిపుణులకు (హై స్కిల్డ్) ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 600కు పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐటీపీ గ్రూప్ సీఈవో ఈవా అజూలే, ఎండీ కార్లోస్ అల్జోలా, వైస్ ప్రెసిడెంట్(ఆపరేషన్స్) వాలెంటిస్ గొరోనో, ఐటీపీ ఇండియా ఎండీ సందీప్ శర్మ తదితరులు పాల్గొన్నారు.