ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించాలి: ప్రధాని మోడీకి భట్టి విక్రమార్క విజ్ఞప్తి

  • పోలవరంకు జాతీయ హోద ఇచ్చి, తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోద కల్పించకపోవడం వివక్షతనే…
  • రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోకుండా కొర్రీలు పెట్టడం, నిధుల విడుదలలో జాప్యం చేయడం రైతుల్ని మోసం చేయడమే.
  • పంట వ్యర్థాలను కాల్చకుండా బయో గ్యాస్ ప్లాంట్‌లకు సరఫరా చేసి రైతులు అదనపు ఆదాయం పొందాలి.
  • ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారానే వ్యవసాయం పండుగలా మారుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కరీంనగర్ పర్యటనను పురస్కరించుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిజైన్ చేసిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు విజ్ఞప్తి చేశారు. సిరిసిల్లా జిల్లా గంబిరావుపేట గ్రామాంలోని పంతులుగారి తోటలో బయోస్ట్రాటమ్ టెక్నాలజీస్ ప్రయివేట్ లిమిటేడ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి మంగళవారం డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ లతో కలిసి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని ఒక ప్రధాన సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని నాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని ఆయన గుర్తు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినప్పటికీ, తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా ఆ హోదా కల్పించకపోవడం తెలంగాణ రాష్ట్రం పట్ల చూపుతున్న వివక్షతకు నిదర్శనమన్నారు.

తెలంగాణలో రైతులు పండించే ప్రతి పంటను కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని కేంద్రం తీసుకోకుండా కొర్రీలు పెట్టడం, నిధుల విడుదలలో జాప్యం చేయడం రైతుల్ని మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. కేవలం కొన్ని పంటలకే మద్దతు ధర ప్రకటించి మిగిలిన వాటి విషయంలో కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని, రాష్ట్రం సేకరించిన ప్రతి గింజను కేంద్రమే సేకరించి సకాలంలో నిధులు విడుదల చేయాలని కోరారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం బహుళార్థక సాధక ప్రాజెక్టులను నిర్మించి, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రైతులకు ఆనేక రకాల ప్రోత్సహకాలు అందించి రైతులకు అండగా నిలబడిందన్నారు.

వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ వరి గడ్డిని ముడిసరుకుగా ఉపయోగించి బయో గ్యాస్ ఉత్పత్తి చేసే బృహత్తర ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం కార్యరూపంలోకి తెస్తోందన్నారు. సాధారణంగా పంట కోతల అనంతరం రైతులు పొలాల్లోనే గడ్డిని కాల్చివేయడం వల్ల వాతావరణం కలుషితమై ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) పడిపోతున్న తరుణంలో, ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. దీనివల్ల పర్యావరణానికి రక్షణ కలగడమే కాకుండా, రైతులకు వ్యర్థాల ద్వారా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో, అభివృద్ధి చెందిన దేశాల బాటలో మన రైతాంగం కూడా అడుగులు వేయాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు. సమాజానికి ఆహారాన్ని అందించే రైతు, ఆరోగ్యకరమైన గాలిని కూడా అందించాలనే ఉద్దేశంతో పంట వ్యర్థాలను కాల్చకుండా బయో గ్యాస్ ప్లాంట్‌లకు సరఫరా చేయాలని కోరారు.

మరోవైపు, వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు పంట మార్పిడి విధానాన్ని రైతులు పాటించాలని కోరారు. కేవలం వరి మీదనే ఆధారపడకుండా ఉద్యానవన పంటలు, చిరుధాన్యాలు, ఆయిల్ పామ్ వంటి లాభదాయకమైన పంటల వైపు రైతులు దృష్టి సారించినప్పుడే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని తెలిపారు. వీటి సాగు వల్ల రైతులకు ఆదాయం పెరగడమే కాకుండా సమాజానికి పోషక విలువలతో కూడిన ఆహారం అందించిన వారవుతారని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పండించిన ప్రతి గింజకూ కనీస మద్దతు ధర (MSP) కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉందని. మద్దతు ధర ప్రకటించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పుట చేసిందన్నారు. పాత పద్ధతులకు స్వస్తి పలికి, ఆధునిక సాగు పద్ధతులను అవలంబించడం ద్వారానే వ్యవసాయం పండుగలా మారుతుందని, ఈ మార్పులో రైతులందరూ భాగస్వాములు కావాలని కోరారు.