హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను ఆయన సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. దీంతో పాటు అదేరోజు బహిరంగసభలో పాల్గొననున్నారు. అందుకు అనుగుణంగా బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు ప్రధాన కార్యదర్శి సూచించారు. బేగం పేట్ విమానాశ్రయం, హెలిప్యాడ్‌లతో పాటు అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక వాహనాలు ఏర్పాటు చేయాలని ఫైర్ సర్వీసెస్ శాఖ అధికారులను, అవసరమైన వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కాన్వాయ్ పర్యటించే మార్గాలలో రోడ్లను పరిశీలించాలని ఏ వైన మరమ్మత్తులు ఉంటే యుద్దప్రాతిపధికన పూర్తి చేయాలని పోలీసు, GHMC, రోడ్లూ భవణాల శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటించే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ప్రధానమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా చూడాలని సూచించారు.
ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ , నవీన్ మిట్టల్, దానకిషోర్, వాణిప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, ఇంటిలిజెన్స్ అడిషనల్ డిజి అనిల్ కుమార్, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్లు విసి సజ్జనార్, రమేష్ , సుమతి, ఫైర్ సర్వీసెస్ డీజీ, విక్రమ్ సింగ్ మన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద రెడ్డి, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.