కాళేశ్వరం అవినీతి పై CBI మౌనం బీజేపీ-బీఆర్ఎస్ లాలూచికి నిదర్శనం: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

హన్మకొండ : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై కమీషన్ విచారణ జరిపి అవినీతి జరిగిందని, ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థ CBIకి అప్పగించి తొమ్మిది నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బీజేపి–బీఆర్ఎస్ మధ్య లాలూచి రాజకీయాలకు నిదర్శనమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు విమర్శించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపి ఎంపీలు చిత్తశుద్ధితో వ్యవహరించాలంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఆలస్యం చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై CBI ద్వారా సమగ్ర విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే వారి నిజాయితి ప్రజలకు స్పష్టమవుతుందని అన్నారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో మంగళవారం హన్మకొండ జిల్లా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ:
రూ.2 లక్షల పంట రుణమాఫీ
సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్
ఎకరాకు రూ.12,000 రైతు భరోసా
దశాబ్దాల భూ సమస్యల పరిష్కారానికి “భూభారతి”
వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. “కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం” అని మంత్రి స్పష్టం చేశారు.
రైతు మేళా – ఆధునిక వ్యవసాయానికి వేదిక
మే 5, 6, 7 తేదీలలో నిర్వహిస్తున్న ఈ రైతు మేళాలో రైతులకు అవసరమైన యాంత్రిక పరికరాలను సబ్సీడీపై అందిస్తున్నామని మంత్రి తెలిపారు. రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రైతు మేళా వేదికగా భూసార పరీక్షలు నిర్వహించిన అధికారులకు మంత్రి గారు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దనసరి సీతక్క గారు, కొండా సురేఖ గారు, ఎంపీ కడియం కావ్య గారు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు, నాయిని రాజేందర్ రెడ్డి గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, కె.ఆర్. నాగరాజు గారు, మేయర్ గుండు సుధారాణి గారు, అగ్రికల్చర్ సెక్రటరీ, హుడా చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకుముందు రైతు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు.