- ఆనుమతి లేని ఆర్ఎంసీ ప్లాంట్లనూ తొలగింపు
- పీసీబీ, మైనింగ్ శాఖల ఫిర్యాదుతో ఒకే రోజు 4 చోట్ల హైడ్రా ఆపరేషన్లు
- 8 క్రషింగ్ యూనిట్లతో పాటు.. 13 ఆర్ఎంసీ ప్లాంట్లలో మూడింటిని నేలమట్టం
- ఇంకా 10 ఆర్ఎంసీ ప్లాట్లను తొలగించాల్సి ఉంది..
అనుమతిలేని క్రషింగ్ యూనిట్లపై హైడ్రా చర్యలు తీసుకుంది. వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం 8 క్రషింగ్ యూనిట్లతో పాటు.. 13 ఆర్ఎంసీ ప్లాంట్లలో మూడింటిని నేలమట్టం చేసింది. మిగిలిన 10 ఆర్ఎంసీ ప్లాట్లను తొలగించాల్సి ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), మైనింగ్ తో పాటు.. రెవెన్యూ శాఖల ఫిర్యాదు మేరకు మంగళవారం హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. మెన్ అండ్ మెషనరీ కావాలని పీసీబీ, మైనింగ్, రెవెన్యూ అధికారులు కోరడంతో హైడ్రా రంగంలోకి దిగి ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. పీసీబీ, మైనింగ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో… రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి, గోపన్నపల్లి, శంషాబాద్‌లోని కొత్వాల్‌గూడలో ఏళ్లుగా నడుస్తున్న క్రషింగ్ యూనిట్లను తొలగించింది. బినామీ పేర్లతో.. బడా సంస్థల అండదండలు, బడాబాబులు వెనకుండి నడిపిన యూనిట్లు నేలమట్టమయ్యాయి. ఇందులో ఏ ఒక్క క్రషింగ్ యూనిట్‌కూ మైనింగ్‌తో పాటు, పీసీబీ అనుమతులు లేకపోవడం గమనించాల్సిదగ్గ అంశం. పీసీబీ నోటీసులు, రెవెన్యూ శాఖ ఆదేశాలు, మైనింగ్ శాఖ అభ్యంతరాలు ఏవీ పట్టించుకోకుండా నడుస్తున్న యూనిట్లు హైడ్రా చర్యలతో మంగళవారం నేల మట్టమయ్యాయి.
సహజసిద్ధమైన కొండలు.. చిట్టడవిని తలపించే విధంగా ఉన్న గుట్టలను ఎలాంటి అనుమతి లేకుండా ధ్వంసం చేస్తున్నారని పీసీబీ, రెవెన్యూ, మైనింగ్ శాఖలు హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాయి. ప్రకృతి విధ్వంశానికి పాల్పడ్డాయని తెలిపాయి. రాత్రీ పగలూ అనే తేడా లేకుండా.. క్రషింగ్ చేసి దుమ్ము రేపి వాయు కాలుష్యానికి కారణమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నాయి. ఇదంతా ఓఆర్ ఆర్ పరిధిలోనే జరుగుతుండడం గమనార్హం. అక్రమంగా నడుస్తున్న క్రషింగ్ యూనిట్లతో పాటు.. వర్కింగ్ లైసెన్సు లేని ఆర్ ఎం సీ (రెడీ మిక్స్ కాంక్రీట్) యూనిట్లను కూడా హైడ్రా తొలగించింది. భవిష్యత్తులో అక్కడ స్టోన్ క్రషింగ్ చేయడానికి వీలు లేకుండా.. పరికరాలను నేలమట్టం చేసింది. భగత్‌సింగ్ స్టోన్ క్రషర్, ఎస్‌వీకే, పరమేశ్వర్ స్టోన్, ప్రథ్వి, గ్రేట్ ఇండియా మైనింగ్, ఆర్ మిల్లర్, తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందిన క్రషింగ్ యూనిట్లతో పాటు.. బీఎస్ ఆర్, అల్ట్రాటెక్, ఏసీసీ రెడీమిక్స్ ప్లాంట్లు ఇందులో ఉన్నాయి.
ఈ ప్లాంట్లు ఎవరివి అంటే సరైన చిరునామా లేకుండా సాగిపోతున్నాయి. ఎన్నిఎకరాలు లీజుకు తీసుకున్న వివరాలు లేవు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కొత్వాల్‌గూడలో దాదాపు 16 ఎకరాల మేర విస్తరించి అందులో 7 ఎకరాల వరకూ కొండల్ని పిండి చేసినట్టు ఆనవాళ్లు కనిపించాయి. తిరుమల మెటల్ ఇండస్ట్రీకి చెందిన క్రషింగ్ యూనిట్ ఇక్కడ నడుస్తోంది. దీనిని మొత్తం తొలగించడమైంది. ఇక్కడే మరో రెండు ఆర్ ఎంసీ ప్లాంట్లను కూడా హైడ్రా మంగళవారం తొలగించింది. బడాసంస్థల అండదండలతో.. బినామీ పేర్లతో నడుస్తున్నట్టు పీసీబీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు చెబుతున్నారు. ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకుని ఈ యూనిట్లు ఉన్నాయి. ప్రకృతి విధ్వంసం ఆపిన హైడ్రాను అభినందించారు.